సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరిగే ఏఐ పాలసీ సదస్సుకు ఆహ్వానం
వర్చువల్‌గా హాజరవుతానన్న ముఖ్యమంత్రి
హార్వర్డ్ విద్యార్థులతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్(హెచ్‌కేఎస్) మార్చిలో నిర్వహించే తొలి ఏఐ సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. ఈ సదస్సుకు దేశం నుంచి ఆయనకొక్కరికే ఆహ్వానం అందింది. హెచ్‌కేఎస్ డీన్ జెరెవిÖ వీన్‌స్టయిన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాహకురాలు రుక్సాండా రెనిటా, ఇతర సభ్యులు సీఎంను కలిసి కోరారు. హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తానని రేవంత్‌రెడ్డి వారికి తెలిపారు.
సీఎంను కలిసిన విద్యార్థులు..
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో తన చివరి రోజున సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సంస్థల ప్రతినిధులు, వర్సిటీలోని వివిధ పాఠశాలలతోపాటు ఎంఐటీ, కొలంబియా తదితర క్యాంపస్‌లోని విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో ముచ్చటించారు. నాయకత్వం, విజయాలు, ఆర్థికాభివద్ధి, అభివద్ధి నమూనాలు, స్థిరత్వం, పర్యావరణ సమస్యలు, రైతు సంక్షేమం, మహిళలు, యువత సాధికారత అంశాలపై చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 గురించి వివరించారు. ఈ విజన్‌తో అందరికీ సమాన అవకాశాలు, ఫలాలు అందడంతోపాటు సాధికారత సాధ్యమవుతుందన్నారు. హార్వర్డ్‌లోని భారతీయ విద్యార్థులు దేశానికి తిరిగొచ్చి పనిచేయాలని, తెలంగాణ రైజింగ్ రాయబారులుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ అభివద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆయనతో తెలిపారు.



