మీ ఆదేశాల‌ తోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?

` ఐదు గంటలపాటు కేసీఆర్‌ను విచారించిన సిట్
` నందినగర్‌లోని నివాసంలోనే మాజీ సీఎంను ప్రశ్నించిన అధికారులు
` విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డులు సేకరణ
హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు సుమారు 5 గంటలపాటు విచారణ చేశారు. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రూపంలో ఐదుగురు ఉన్నతాధికారుల సిట్ బృందం రికార్డింగ్ చేసింది. అలాగే దీనితో పాటు ఆయన ఇచ్చిన కీలక వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం సిట్ అధికారులు నందినగర్ నుంచి వెళ్లిపోయారు. కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ నందినగర్‌లోని నివాసం రెండో అంతస్థు గదిలో జరుగింది. ఈరోజు మధ్యాహ్నం పలు డాక్యుమెంట్లు, పరికరాలతో సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా అంతకుముందు రెండు రోజుల క్రితం సిట్ ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్‌హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగున నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్‌పై గులాబీ పూల వర్షం కురిపించారు. దారి పొడువునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను విచారించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ వాంగ్మూలాలు నమోదు చేసుకునేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఆడియో, వీడియో పరికరాలను అమర్చుకున్నారు. కేసీఆర్?ను ప్రశ్నిస్తున్న సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యులు నందినగర్ నివాసంలోనే ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు అక్రమ ఫోన్ ట్యాపింగ్‌వైపు మళ్లింది. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులెవరో తేల్చే ప్రయత్నాల్లో ఉన్న సిట్ అధికారులు నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాంగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇది కక్షసాధింపుకే పరాకాష్ట
కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ చేయడం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. సిట్ పేరిట ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలనూ ఉల్లంఘించారన్న ఆయన నోటీసులు ఇవ్వడంలో చట్టపర విధానాలు పాటించలేదన్నారు. ఎర్రవెల్లిలో ఇవ్వకుండా నందినగర్ ఇంటి గోడలకు అంటించారని ఇలా చేయడం చౌకబారు రాజకీయం అని అన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్టానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సిట్ ‘సీఎం ఇన్స్టక్షన్ టీమ’గా పనిచేస్తోందని ఆరోపించారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ పోలీసులు అతిగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రత కోసం, ఉగ్రవాద నిర్మూలన కోసం ఫోన్ ట్యాపింగ్ ఉంటే బీఆరఎస్ నేతలు మాత్రం దానిని దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వ్యక్తిగత పనుల కోసం, రాజకీయ కక్షలకు ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకున్నారని ఆక్షేపించారు.
సీఎం నివాసం వద్ద భద్రత పెంపు
జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసాన్ని బీఆరఎస్ నేతలు ముట్టడిస్తారనే సమాచారంతో అక్కడ భద్రత పెంచి పోలీసులను మోహరించారు. సీఎం, మంత్రుల నివాసాలను బీఆరఎస్ నేతలు ముట్టడిస్తారనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బీఆరఎస్ కార్యకర్తల హల్‌చల్
` కార్యకర్తలకు అభివాదం చేసిన కేసీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు బీఆరఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతోపాటు ఇతర నేతలు ప్రయత్నించారు. ఆ నేతలంతా బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆరఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆరఎస్ నేతలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు ఆప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని శంబీపూర్ రాజు మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే తాము మరింత దూకుడుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.
బీఆరఎస్వీ నేతల అరెస్ట్.. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
భారత రాష్ట్రసమితి శ్రేణుల ఆందోళనతో హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీఆరఎస్వీ విద్యార్థి విభాగం నేతలు.. సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బీఆరఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అరెస్ట్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆరఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల బీఆరఎస్ నేతలు నిరసన చేపట్టారు. విచారణ అనంతరం నందినగర్ నివాసం వద్ద పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా నందినగర్‌లోని కేసీఆర్ ఇంటివద్దకు బీఆరఎస్ నేతలు భారీగా చేరుకున్నారు.