తల్లిదండ్రులకూ డ్రెస్ కోడ్
బెంగళూరు, జూలై 12 : బెంగళూరులోని పాఠశాలలు పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా డ్రెస్ కోడ్ నిర్దేశించారు. పొద్దున్నే లేచి తమ బిడ్డలను తయారు చేసుకుని స్కూళ్లకు వచ్చే తల్లిదండ్రులు నైటీల్లోనూ, షాట్స్ రావటం చూసిన స్కూళ్ల యాజమాన్యాలకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు. స్కూళ్లకు పిల్లలను తీసుకువచ్చే తల్లులూ తప్పని సరిగా చీరలు, సల్వార్ కమీజ్ లాంటివి ధరించి రావాలని ఆంక్షలు పెట్టడం జరిగింది. తాము ఎన్సోసార్లు తల్లిదండ్రులకు ఇలాంటి డ్రెస్సుల్లో రావద్దని చెప్పామని, అయినా వినిపించుకోకపోవడంతో ఇలాంటి ఆంక్షలు పెట్టాల్సి వచ్చిందని ఉల్సార్ స్కూల్ ఆఫ్ అకాడమిక్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోజ్‌లైన్ తెలిపారు. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నిద్రలేవగానే పిల్లలు చూసేది తల్లులనే. తల్లే వారికి ప్రథమ గురువు. వారివద్ద నుంచే పిల్లలుఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలాంటి తల్లి హుందాగా ఉంటే పిల్లలు మానసికంగా వికాసం చెందడమేకాకుండా ఎన్నో విషయాలు నేర్చుకుంటారని స్కూళ్ల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ డ్రెస్ కోడ్ దాదాపు ఏడు స్కూళ్లలో అమలవుతోంది.