తిరుపతి ఉప ఎన్నికలో టిడిపి ఘనవిజయం

కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంతు

తిరుపతి,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. సవిూప కాంగ్రెస్‌ అభ్యర్థిపై సుగుణమ్మ లక్షా 16వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాగే పోటీ చేసిన వారెవరికీ డిపాజిట్లు దక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి శ్రీదేవి దరిదాపులలో కూడా లేరు. ఉప ఎన్నికను ఏకగ్రీవంచేయాలన్న సూచనను పక్కన పెట్టి  కాంగ్రెస్‌ పార్టీ తిరుపతిలో అభ్యర్దిని నిలబెట్టి పరువు తీసుకుంది. విభజన విషయంలో కాంగ్రెస్‌పై ఆగ్రహంగా ఉన్న ఓటర్లు ఈ ఎన్నికలో మరోమారు తమ కసిని చూపారు. మాజీ ఎంపి చింతా  మోహన్‌ తన మాట నెగ్గాలని భావించి కాంగ్రెస్‌ కు ఘోరమైన పరాజయం తెచ్చిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు దేవనారాయణ రెడ్డి అయితే పోటీ ఇవ్వగలరని సూచించినా ఆయన పట్టించుకోలేదు. నిజానికి ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒప్పుకున్నా కాంగ్రెస్‌ కు పరువు మిగిలేది. కాంగ్రెస ను తిరిగి బతికించడానికి పిసిసి అద్యక్షుడు రఘువీరా ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఉప ఎన్నికతో మరోసారి కాంగ్రెస్‌ బతకదనే అభిప్రాయం కలిగించినట్లయింది. నందిగామ ఉప ఎన్నికలో పాతికవేల ఓట్లు తెచ్చుకుని ఫర్వాలేదనిపించుకున్న కాంగ్రెస్‌ ఇక్కడ మాత్రం పూర్తిగా పరువు కోల్పోయింది. తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ(టీడీపీ) 2014 డిసెంబర్‌ 15న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో వెంకటరమణ సతీమణి సుగుణమ్మనే గెలుపొందింది. టీడీపీ గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. 1,16,524 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిని సుగుణమ్మ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శ్రీదేవిని బరిలోకి దింపిన కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. తనది ప్రజా విజయం అని, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని సుగునమ్మ చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మొత్తం 1,47,216 ఓట్లు పోలవగా టీడీపీకి 1,26,152 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు 9,628 ఓట్లు, లోక్‌సత్తా 3,819 ఓట్లు ఇండిపెండెంట్‌ కోటిరెడ్డి 3,156 ఓట్లు దక్కాయి. నోటాకు 2,152 ఓట్లు పడ్డాయి. వీరంతా డిపాజిట్లు కోల్పోయారు. తనభర్త వెంకటరమణ ప్రజల కోసం చేసిన సేవ తనను గెలిపించిందని సుగుణమ్మ అన్నారు. ఆయన ఆశయాలు, ప్రజ ఆకాంక్షల మేరకు పనిచేస్తానని అన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ఈ నెల 13న జరిగిన సంగతి తెల్సిందే. ఆది నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌లో.. నియోజకవర్గంలోని మొత్తం 2,94,781 ఓటర్లలో 49.94 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి నియోజకవర్గ చరిత్రలో ఇంత తక్కువగా ఓట్లు పోలవడం ఇదే ప్రథమం. ఆపై ఈవీఎంలు అన్నిటినీ ఎస్వీఆర్ట్స్‌ కళాశాలకు అదే రోజు రాత్రి పటిష్ట బందోబస్తు నడుమ తరలించారు. ఇక.. తుదిగా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు చేపట్టారు. లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్‌ విధించారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తదితరులు పలుమార్లు పరిశీలించి అక్కడి సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. ఆదినుంచీ లెక్కింపులో టిడిపి ఆధిపత్యం కనిపించింది.