తెదేపా నేతల అరెస్టు : యనమల ఆగ్రహం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తెదేపా తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. చేతకాని ముఖ్యమంత్రివల్లే ప్రజల జీవితాలు గాల్లో దీపాలుగా మారాయని వారు విమర్శించారు. తెదేపా చేపట్టిన శాంతిర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. ప్రధాన భద్రత పేరుతో శాంతిర్యాలీని అడ్డుకోవడం తగదిని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతలను పరిరక్షించలేని పోలీసులు శాంతిర్యాలీని ఎలా అడ్డుకుంటారని ఆయన నిలదీశారు. బాంబు దాడులు జరగవచ్చని ముందస్సు సమాచారం ఉన్నా ప్రజల ప్రాణాలు కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.