తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవా రంనాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శిం చారు. రాష్ట్రంలపాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే.. కిరణ్‌ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అధికారులే పాలిస్తున్నారని విమర్శించారు. అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడం వల్ల అనేక తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని పాల్వాయి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పులను గమనించి పోలవరం ప్రాజెక్టు నమూనాను మార్చాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహించవద్దని కేంద్ర మంత్రి నటరాజన్‌ చెప్పినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యమని అన్నారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టు నమూనాలను ఆపివేయకుంటే ప్రభుత్వం అప్రతిష్టను మూట గట్టుకోవాల్సి వస్తుందని పాల్వాయి హెచ్చరించారు. తమ సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమిస్తామని అన్నారు.