తెలంగాణను సాధించి తీరుతాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణను సాధించి తీరుతామని టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. మంగళవారం టిడిపి నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి కేసిఆర్‌ మరికొందరు టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు వెళ్ళి హరీశ్వర్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. దాదాపు గంటసేపు కేసిఆర్‌ ఆయనతో మంతనాలు జరిపారు. అనంతరం కేసిఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తన జీవిత లక్ష్యమని అన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీతో కలిసి సంబరాలు జరుపుకుంటామని, లేకుంటే సమరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో సీమాంధ్రపార్టీలకి స్థానం ఉండబోదని అన్నారు. నవంబర్‌ 15న రంగారెడ్డి జిల్లాలో చెవెళ్ళలో జరిగే బహిరంగ సభలో హరీశ్వరరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరతారని కేసిఆర్‌ తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. నవంబర్‌ 5,6 తేదీలలో కరీంనగర్‌ జిల్లాలో పార్టీ మేథోమదనం సదస్సు నిర్వహిస్తామని అందులో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కేసిఆర్‌ అన్నారు. తెలంగాణపై ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో తాను చర్చలు జరిపానని అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ పార్టీతో కయ్యానికి సిద్ధమని అన్నారు. టిడిపి, వైయస్సార్‌సీపీ రెండూ సీమాంధ్రపార్టీలేనని కేసిఆర్‌ అన్నారు. మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు యూటర్న్‌ తీసుకోవడం వల్లనే తాము పార్టీని విడిచామని అన్నారు.