తెలంగాణపై కోర్‌ కమిటీలో చర్చించాం


ఇంతకాలం ఆగారు, మరి కొంతకాలం ఆగలేరా?
హోంమంత్రి షిండే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబర్‌ 10 : తెలంగాణపై అన్ని పార్టీల నేతలతో చర్చించామని, సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్రహోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. ఈ విషయమై పార్లమెంట్‌ సమావేశాల ముందుగానీ, ఆ తర్వాత గానీ అవసరాన్ని బట్టి అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సీనియర్‌ నాయకులతో ఈ అంశంపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. 10, జనపథ్‌లో నిన్న జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించినట్లు ఆయన చెప్పారు. సమస్య పరిష్కారం కోసం ఇంతకాలం ఆగారు. మరికొంత కాలం ఆగలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియా ప్రశ్నించగా, ఆ లేఖ విషయం తన దృష్టికి రాలేదని షిండే వ్యాఖ్యానించారు.
కాగా షిండే వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ పార్టీ మండిపడింది. ఎంతో కాలంగా తెలంగాణ ప్రజలు ఎంతో ఓపికగా ఎదురుచూశారని, ఇకపై ఎదురు చూసే ఓపిక వారికి లేదని టిఆర్‌ఎస్‌ ఎల్‌పి ఉపనేత టి.హరీశ్‌రావు అన్నారు. ఇంతకాలం ఆగాక కూడా ఇంకా వేచి చూడండి అని అనడం సమంజసం కాదన్నారు. ఇకపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు. మాజీ ఎంపి వినోద్‌ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ ప్రజలు చాలా కాలం ఆగారని, ఇక వారు ఆగబోరని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ అనుకూలమా, వ్యతిరేకమా తేల్చి చెప్పాలన్నారు. ముందుగా కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరి ప్రకటించాకే అన్ని పార్టీల అభిప్రాయాలను అడగాలని ఆయన అన్నారు.