తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అయితే, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తున్నది. ఆదిలాబాద్‌ జిల్లా డైట్‌ కాలేజీలోని పోలింగ్‌ కేందంలో ఈవీఎం మొరాయించడంతో మాక్‌ పోలింగ్‌ ఆలస్యమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతండగా.. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది.సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్‌ కొనసాగనున్నది. సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందులో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ కొనసాగుతుందని ఈసీ తెలిపింది. 119 నియోజకవర్గాల్లో ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు 19, ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు 12 ఉన్నాయి. ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 1,63,13,268 పురుష ఓటర్లు.. 1,63,02,261 మహిళలు ఓటుహక్కును వినియోగించనున్నారు. 2,676 ట్రాన్స్‌జెండర్లు ఓటేయనున్నారు. 15,406 సర్వీస్‌ ఓటర్లు వేయనున్నారు. ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఇందులో 12వేల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 27,094 వెబ్‌కాస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 120 పోలింగ్‌ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తుండడం విశేషం. అలాగే 597 పోలింగ్‌ కేంద్రాలను మహిళా సిబ్బంది. 119 కేంద్రాలను యువత నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం 644 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.