తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయండి
ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించిన ఉద్యమ కారులు
జగిత్యాల,ఆగస్టు 26(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘాలలో పనిచేసి మరోసారి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు సాగేందుకే జగిత్యాల జిల్లా ఉద్యమకారుల సదస్సును నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ గల్ఫ్ కార్మికుల సెల్ రాష్ట్ర కన్వీనర్ షేక్ చాంద్ పాషా కోరారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో సెప్టెంబర్ 5న దేవిశ్రీ గార్డెన్స్ లో నిర్వహించే జగిత్యాల జిల్లా తెలంగాణ ఉద్యమ కారుల సదస్సు పోస్టర్ ను ఉద్యమ కారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చాంద్ పాషా తోపాటు పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మ కారుల ఫోరమ్, తెలంగాణ జె.ఏ.సి, గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘాల సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి నేతలు డా. చీమ శ్రీనివాస్, కొల జనార్దన్ గౌడ్ తోపాటు పలువురు హాజరౌతున్నారని చెప్పారు. తెలంగాణ సాధనలో పాల్గొన్న ఉద్యమ నాయకులకు, ఉద్యమ కారులందరికి సాదర ఆహ్వానమని చెప్పారు. మనముందు తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు సాధన, ఎన్. ఆర్.ఐ పాలసీ తోపాటు అనేక విషయాలపై సదస్సులో చర్చ ఉంటుందని చెప్పారు. ప్రతి ఉద్యమ కారులు హాజరై తమ అభిప్రాయాలను, సూచనలను అందించి సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కారులు, సామాజిక వేత్తలు ఎన్నమ నేని శ్రీనివాసరావు, బండ శంకర్, గాజుల రాజేందర్, బాస ప్రకాష్, కుర్షిద్ అలీ, మీర్ ఖాజీమ్ అలీ, బాలకృష్ణ లు ఉన్నారు.