తెలంగాణ ఎంపీల అస్త్ర సన్యాసం

బానిసత్వం,లొంగుబాటు, ప్రతిఘటించపోవడం
మన తెలంగాణ నేతలకు అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతల మాటలు కోటలు దాటినా కాలు గడప దాటడం లేదు. అదిగో ఇదిగో అంటూ బీరాలకు పోవడం తప్ప పట్టుబిగించి అనుకున్నది సాధించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా, ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన చిరంజీవి అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసి ‘చిరు’ బోలెడు కోర్కెలు తీర్చుకున్నారు. అంతెందుకు ఎంఐఎం పార్టీ కూడా కిరణ్‌ సర్కార్‌కు మద్దతు పలికి మేయర్‌ సీటు కొట్టేసింది. ఇలా ఎవరికి వారు మద్దతు పేరుతో తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారు.ఇందులో తప్పుబట్టాల్సిన పని లేదు. బుద్ధున్న ప్రతి వాడూ ఇలా చేయాల్సిందే. ఆ బుద్ధే మన తెలంగాణ ఎమ్మెల్యేలకు లేకపోవడమే బాధకలిగించే అంశం. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎందుకోగాని తెలంగాణ అంశాన్ని తమ అవసరంగా కూడా చేర్చుకోలేకపోయారు. ప్రజలు వడిశెల్ల రాళ్లు నింపి ‘ఆపరేషన్‌ పోలో’ మొదలు సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు సాగుతున్న నక్సల్‌బరి అస్తిత్వపోరాటాల్లో మన వాళ్ల సాహస పోరాటం మరువలేనిది. ఎందుకోగాని రాజకీయ పార్టీల నేతలు పోరాటం మొదలు కా ముందే, శంఖం ఊదక ముందే అస్త్ర సన్యాసం చేసి చేతులత్తేయడం కూడా ‘తెలంగాణ’కు శాపంగా మారిందనే చెప్పొచ్చు. పోరాటాలు మొదలు కాగానే కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తెలంగాణ వాదాన్ని వినిపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వాడుకోవాలని తెలంగాణ జేఏసీ చేసిన అప్పీల్‌ను మన కాంగ్రెస్‌ ఎంపీలు బేఖాతరు చేసి అధిష్టానానికి జీ హుజూర్‌! అన్నారు. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ‘మాటా-ముచ్చట’ లేకుండానే ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వానికి సమ్మతి తెలుపుతూ సంతకాలు చేశారు. అంత వరకైతే బాగానే ఉండేది. తెలంగాణకు ప్రణబ్‌ సానుకూలంగా ఉన్నారని పచ్చి అబద్ధాన్ని చెప్పడమే ఇబ్బందికరంగా ఉంది. అయితే టీ-కాంగ్రెస్‌ ఎంపీలు ఇచ్చిన సర్టిఫికెట్‌ తెలంగాణ ప్రాంతంలో చెల్లుబాటు కాదనే విషయాన్ని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు విస్మరించడం శోచనీయం. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం నేతల్లో ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్యుడు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వం వేసిన ప్రణబ్‌ కమిటీ వెలగబెట్టిన నిర్వాకం అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఒక్క అడుగు ముందుకు వేయలేదు.అందుకు ప్రణబ్‌ లేశమాత్రం కృషి కూడా చేయలేదు. తెలంగాణపై తమ వైఖరిని వెల్లడిస్తూ తెలుగుదేశం పార్టీతోసహా యూపీఏ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ప్రణబ్‌ కమిటీకి లేఖలు ఇచ్చాయి. నిజానికి రాష్ట్ర విభజనకు ఎవరి లేఖలు అవసరం లేదు. తెలంగాణ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తే సరిపోతుంది. ఏకాభిప్రాయం అవసరం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌-2 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు.అవేమీ చేయకుండా లేఖల పేరిట తెలంగాణ అంశాన్ని నాన్చుతూనే ఉన్నారు. తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖలపై స్పందించకుండా తాత్సారం చేసిన తెలంగాణ ద్రోహి ప్రణబ్‌ ముఖర్జీ. ప్రణబ్‌కు తెలంగాణపట్ల ఉన్న అవగాహన ఇదే. ఇది కాకుండా ప్రణబ్‌కు ఎలాంటి సానుకూలత, అవగాహన ఉందో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సెలవివ్వాల్సిన అవసరం ఉంది. ప్రణబ్‌ అభ్యర్థిత్వాన్ని ఎందుకు సమర్థించాల్సి వచ్చిందో, తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ఎన్నికల్లో మన ఆకాంక్షగా ఎందుకు వ్యక్తపర్చలేకపోయారో కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది.