తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను వెల్లడించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5.6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది పరీక్షలు ముగిసిన 38 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయగా… ఈ ఏడాది రికార్డుస్థాయిలో 32 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు.
వరంగల్ ఫస్ట్ … హైదరాబాద్ లాస్ట్
తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 85.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,55,265 మంది విద్యార్థులు హాజరుకాగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు. 2015లో 77.56 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత 8 శాతం పెరిగింది.
బాలికలదే పైచేయి
బాలురు 84.70 శాతం పాస్ కాగా, బాలికలు 86.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 1.87 అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,370 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 10 పాఠశాలలు సున్నా ఫలితాలు సాధించాయి.
ఫలితాల్లో వరంగల్ జిల్లా 95.13 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. రాజధాని నగరం హైదరాబాద్ 76.23 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా (91.19 శాతం), మెదక్ (90.74శాతం), నిజామాబాద్ (90.04 శాతం) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.