కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ


అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం
దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ ఆలోచనతో భారతీయ జనతాపార్టీ ఉద్యమం చేయటం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన తెలంగాణపోరుదీక్షను విరమించారు. బిజెపి అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న రాష్టాల్రతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అదే లక్ష్యంతో బిజెపి హయాంలో చిన్న రాష్టాల్రను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అక్కడ బిజెపి అధికారంలోకి వస్తుందని ఎంఐఎం నేతలు సోనియాగాంధీకి చెబుతున్నారని, దీనివల్లే సోనియాగాంధీ తెలంగాణ విషయంలో ఆలస్యం చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేసినప్పటికీ 1969 నుంచి మొన్నటివరకు జరిగిన ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అది చెప్పకుండా తెలంగాణను ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను స్వాగతించరని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీగా దేశప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత బిజెపికే ఉందని ఆయన అన్నారు. అద్వానీ చేపట్టిన జనచైతన్య యాత్రలో కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయనను అడిగిన విషయాన్ని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 1956కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏవిధంగా ఉందో ఇప్పుడు కూడా అలాంటి రాష్టాన్న్రే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు కొంత మంది నాయకులు ప్రతిపాదనలు చేస్తున్నారని, అదే నిజమైతే కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ప్రాంతంలో తిరగలేరని కిషన్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగగా తెలంగాణ జిల్లాల్లో నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఉత్సవాలను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం నిర్వహించడం లేదని, అయితే ప్రభుత్వం చిత్తశుద్దితో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తే ముస్లింలు ఎవరూ అడ్డుకోరని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్వహించకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో బిజెపియే నిర్వహిస్తుందని, ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాజకీయ పార్టీలు కలిసిరాకుంటే ఉద్యమసంఘాలు, కులసంఘాలు, విద్యార్ధులు కళాకారులతో కలిసి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.