తెలంగాణ తీర్మానం కోసం

సభలో హోరెత్తిన జై తెలంగాణ
ప్రశ్నోత్తరాల రద్దు.. పట్టు వీడని టీఆర్‌ఎస్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి): వరుసగా ఐదవ రోజుకూడా అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభమైన తరువాత విపక్షాలు తమ వాయిదా తీర్మానాలను అనుమతించాలని పట్టుబట్టాయి. టిఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేసిన వారు వినిపించుకోలేదు. విపక్షాల ఆందోళనతో సభ రెండుసార్లు వాయిదా పడినప్పటికీ వారు తమ పట్టును వీడకపోవడంతో విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ శనివారం నాటికి వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదాలతోనే సరిపోయింది. తెలంగాణ అంశంపై సభలో గందరగోళం నెలకొనడంతో సభ వరుసగా రెండుసార్లు వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభంకాగానే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. దీంతో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలంటూ టీఆర్‌ఎస్‌సభ్యులు స్పీకర్‌ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చిన సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ సభ సజావుగా జరిగేలా చూడాలని నేతలను కోరినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో స్పీకర్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.
అనంతరం అసెంబ్లీ నిర్వాహణపై మంత్రుల శ్రీధర్‌బాబు, ఏరాసు, కన్నా లక్ష్మీనారాయణ, చీప్‌ విప్‌ గుండ్రలతో సమావేశమయ్యారు. మరోవైపు సభ వాయిదా పడినప్పటికీ స్పీకర్‌ పోడియం వద్ద టీఆర్‌ఎస్‌నేతలు ఆందోళన కొనసాగించారు. తెలంగాణకు టీడిపి మద్దతు తెలుపాలంటూ హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. గంటపాటు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణపై చర్చ జరగాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి విద్యుత్‌పై చర్చకు స్పీకర్‌ అనుమతించినప్పటికీ టీడిపి, టీఆర్‌ఎస్‌ నేతలు వెనక్కి తగ్గలేదు. స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తారని సభాపతి పదేపదే చెప్పినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభ మరో గంటపాటు వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో సభను శనివారం నాటికి వాయిదా వేశారు.