తెలంగాణ ప్రజలను చాలా కాలం మోసం చేయలేరు : ఐకాస

ఆదిలాబాద్‌, జూన్‌ 21 :
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు గురువారంనాటికి 900 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ప్రజల మనోభావాలకు కేంద్రం తలవంచాల్సిందేనని వారు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అకాంక్ష మేరకు పని చేయాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అన్ని రకాలుగా వెల్లడించినప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలను ఎంత కాలం వంచిస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం తమ మొండి వైఖరిని వీడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.