తెలంగాణ మార్చిలో పాల్గొంటరో..

రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి
మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు పదవులకు రాజీనామాలు చేస్తారో ? తేల్చుకోవాలని కోదండరాం సవాల్‌ చేశారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని చేజార్చుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతోందని వారి మాటలు వింటే తెలంగాణలో నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీనేనని గుర్తించాలని కోదండరాం హెచ్చరించారు. అరెస్టులతో తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెసమంత్రులపైనే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ మార్చ్‌ను విరమించుకోవాలని చెప్పే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని ఆయన తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోనే తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందని అన్నారు. తెలంగాణ మార్చ్‌ను విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న ప్రకటనలను కోదండరాం తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెప్పిు అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మార్చ్‌ను గాంధేయ మార్గంలోనే చేపడుతామని, తెలంగాణ సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించాలని కోదండరాం కోరారు. సీమాంధ్ర పాలకులతో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ మార్చ్‌లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపేరుగని పోరాటం చేస్తామని కోదండరాం అన్నారు.