‘తెలంగాణ మార్చ్’కు రాకుండా రైళ్లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లు పైకి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మార్చ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు లోపాయికారిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఆధారపడే పలు ప్యాసింజర్ రైళ్లు ఆదివారం తిరగకుండా రద్దు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వచ్చే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శనివారం రైళ్ల రద్దు, తాత్కాలిక రద్దుల వివరాలను తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే రైళ్ల రద్దుకు నిర్దిష్టమైన కారణాలేమి ఈ ప్రకటనలో చెప్పలేదు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, రైల్వే వర్గాల ఫోన్లు పని చేయకపోవడం గమనార్హం. కేవలం ‘ఆపరేషనల్ రీజన్స్’ అంటూ చెప్పి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ రాకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. గుంటూరువైపు నుంచి సికింద్రాబాద్ వచ్చే రెండు రైళ్లను సీమాంధ్ర సరిహద్దు వరకే పరిమితం చేశారు. తెలంగాణ జిల్లాలోకి రాకుండా సరిహద్దు నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. అలాగే ఔరంగాబాద్, నాందేడ్, బీజ్‌పూర్ నుంచి వచ్చే ప్యాసింజర్ రైళ్లు కూడా తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల నుంచి వెనక్కి మల్లించారు.