తెలంగాణ వచ్చింది గొర్రెలు, బతుకమ్మ చీరల కోసమా!
– అమలుకాని హావిూలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుండు
– నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. అందుకే కేసీఆర్‌పై పోరాటం
– కేసీఆర్, బీజేపీలపై విమర్శలు గుప్పించిన రేవంత్
– చంద్రబాబుపై ప్రశంసల వర్షం
– హైదరాబాద్‌లో అట్టహాసంగా ఆత్మీయుల మాట-ముచ్చట
– హాజరైన టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ
– నేడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడి
హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణాను తెచ్చుకొంది గొర్రెలు, బతుకమ్మ చీరల కోసమా అంటూ కేసీఆర్ ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో తన నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫాం హౌస్ కట్టుకుని, వేల కోట్ల వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను తన కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించికుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ చెప్పిందేంటీ? ఇప్పుడు చేస్తోందేంటీ? అని ఆయన ప్రశ్నించారు. బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బతుకమ్మ చీరల కోసమా తెలంగాణను సాధించుకుంది? వీటి కోసమేనా తెలంగాణ బిడ్డలు బలిదానం చేసింది? అని నిలదీశారు. ఈ బర్రెలు, గొర్రెలను ఆంధ్ర పాలకులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఎన్నో కుట్రలతో సీఎం అయిన కేసీఆర్, బోలెడన్ని హావిూలు ఇచ్చారని, ఇప్పుడేమో ఇలా ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలుగు ప్రజలకోసం చంద్రబాబు పీఎం పదవి వదులుకున్నారు..
ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథం వైపు రాష్టాన్న్రి నడిపిస్తూ ఎన్నో కష్టాలు పడుతుంటే, ఇక్కడ కేసీఆర్ ఏవిూ చేయడం లేదని రేవంత్ అన్నారు. చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయనతో కలిసి పదేళ్లు పనిచేశానని అన్నారు. చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్నానని, అలాంటి నాయకుడిని వదులకుని వచ్చానని తెలిపారు. ప్రధాని పదవికి అవకాశం వచ్చినా తెలుగు ప్రజల కోసం చంద్రబాబు వదలుకున్నారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ చేస్తోన్న అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి కూడా తాను వెళ్లలేదని, తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎంలు ఉన్నాయని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరినొకరు సమర్థించుకుంటున్నారని, కొద్ది సేపటికే మళ్లీ విమర్శించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తాను తుది ఉద్యమం చేయాలనుకుంటున్నాని తెలిపారు. బీజేపీ, ఎంఐఎంతో టీఆర్‌ఎస్ దోస్తీ పెట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు బాగుంటున్నాయని, నోట్లరద్దు, జీఎస్టీలను కేసీఆర్ సమర్థించారని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు తెలిపారని అన్నారు. ఇన్ని చేశారు కేసీఆర్ మా వ్యక్తా కాదా? అని బీజేపీ నేతలు తనను ప్రశ్నించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా అడిగితే, మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తున్నాం అని టీఆర్‌ఎస్ నాయకులు అంటారు.. నేను అడిగేది అదే.. 14 ఏళ్ల ఉద్యమకాలంలో ఏమేం చెప్పారు.. అధికారంలోకి వచ్చిన 40 నెలల్లో ఏమేం చేశారు? అని! సామాజిక తెలంగాణ జాడ లేకుండా పోయింది. ప్రతిపక్షాల గొంతునొక్కడం కేసీఆర్‌కు అలవాటైంది. ఇకపై ఆయన ఆటలు సాగనివ్వబోము’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఏపీలో బద్ధశత్రువులు కలిశారు.. తెలంగాణలో వద్దా?..
ఆంధప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందనుకున్నవేళ.. అక్కడి రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. ‘రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 48 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి కేవలం 18 శాతం మాత్రమే పడ్డాయన్న రేవంత్ విభజన సమయంలో రాష్టాన్రికి అన్యాయం జరుగుతోందన్న భావన అందరిలో కలిగిందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని చాలా మంది నేతలు తెలుగుదేశంలో చేరి ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్న చేశారన్నారు. టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావులు, జేసీ దివాకర్‌రెడ్డి లాంటివాళ్లు అలా వచ్చినవారు టీడీపీకి వారు శత్రువులే అయినా, అందరితో మాట్లాడి చంద్రబాబు ఒప్పించారన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి పునరేకీకరణ జరగాలని, కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సింది. అందుకే కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేయాలని నేను కోరానని అని రేవంత్ చెప్పుకొచ్చారు.
టీడీపీ కార్యకర్తలంతా తనకు మద్దతు పలకాలి..
రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. టీడీపీ కార్యకర్తలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జాతీయ స్థాయిలో రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం.. కేసీఆర్ కాళ్ల కింద పడి ఉండటంకాదు.. నిటారుగా నిలబడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, జనారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు తనకు బంధువునేనని, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉండేదని రేవంత్ గుర్తుచేసుకున్నారు. 2006 నాటికి ఎంత అనుబంధం ఉన్నప్పటికీ అప్పట్లో తాను కాంగ్రెస్‌లోకి చేరలేదని, ప్రతిపక్ష టీడీపీలో చేరి ప్రజల కోసం పనిచేశానన్నారు. ఇప్పటి సందర్భంలో గురువులాంటి చంద్రబాబును వదిలిపెట్టి, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లోనే చేరుతున్నానన్నారు.



