దక్షిణాదిపై కుట్ర

` డీలిమిటేషన్‌ పేర సీట్లు తగ్గిస్తే సహించేదిలేదు
` ఉత్తమ పనితీరు రాష్ట్రాలుగా మేం గర్వపడుతున్నాం
` మమ్మల్ని అణచాలని చూస్తే ఊరుకోం:మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్‌ చేశారు. దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గినే బలమైన ప్రజాఉద్యమం వస్తుందని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలం భారతీయులుగా గర్వపడుతున్నామని, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నామన్నారు. పార్లమెంట్‌ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అన్నారు. దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించమని స్పష్టం చేశారు. కేంద్రం అన్ని విషయాలను వింటుందని ఆశిస్తున్నామని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామంటూ సోమవారం ఎక్స్‌యాప్‌లో (ట్వీట్‌) చేశారు. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక ప్రచురించిన డీలిటేషన్‌కు సంబంధించిన కథనాన్ని ట్యాగ్‌ చేశారు. కథనంలో పేర్కొన్న గణాంకాలే నిజమైతే ప్రజా ఉద్యమం తప్పదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.అయితే, దేశంలో ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్వీభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం పెరుగనుండగా.. దక్షిణాదిలో భారీగా స్థానాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 32 స్థానాలు కలిసిరానుండగా.. దక్షిణాది రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోనున్నాయి. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్‌ స్థానాలుండగా.. డీలిమిటేషన్‌ తర్వాత 31కి తగ్గనున్నాయి. ఒక్క తమిళనాడే ఎనిమిది సీట్లను కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ, ఏపీ నుంచి ఎనిమిది, కేరళ ఎనిమిది, కర్నాటక రెండు స్థానాలు కోల్పోనుండగా.. మధ్యప్రదేశ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో 6, బిహార్‌లో పది, ఉత్తరప్రదేశ్‌లో అదనంగా 11 స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

తాజావార్తలు