దమ్ముంటే నిరూపించండి

share on facebook

– నిమిషంలో రాజీనామా చేస్తా..

– పింఛన్ల అసత్య ప్రచారంపై కేసీఆర్‌ బస్తీమే సవాల్‌

– దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైంది

– కేంద్రం గుండాగిరి చేస్తుంది

– పిడికిలి బిగిస్తా….కేంద్రంపై ఉద్యమిస్తా…

– దళితుల సంక్షేమం కోసమే దళిత చైతన్య జ్యోతి

– సన్నాలకు మద్దతు ధర కల్పిస్తా…

– రైతును రాజును చేసినప్పుడే బంగారు తెలంగాణ

– తెలంగాణ రైతులు ప్రపంచానికి దిక్సూచీ కావాలి…

– కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

పాలకుర్తి,అక్టోబరు 31(జనంసాక్షి):దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏవిూ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పారు. కానీ భాజపా నేతలు మాత్రం పింఛనులో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారంచేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానని సవాల్‌ విసిరారు. శనివారం జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. భాజపా నేతలకు ఓట్లు మాత్రమే కావాలి తప్ప ప్రజలు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామన్నారు. రైతులను కాపాడుకొనేందుకు పిడికిలి బిగించాలని, యుద్ధానికి కదలాలన్నారు. మక్కలు సాగుచేస్తే మద్దతు ధర రాకుండా రైతులు మునిగిపోతారన్నారు. నష్టపోయినా సరే ఈసారి మక్కలు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

‘కోటి ఎకరాల్లో వరి పండించే మగోడు తెలంగాణ’

కోటి ఎకరాల్లో వరి పండించే మగోడు తెలంగాణ రాష్ట్రమన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 45శాతం వరి ధాన్యం ఇస్తే.. ఒక్క తెలంగాణ నుంచే 55శాతం వచ్చినట్టు ఎఫ్‌సీఐ ప్రకటించిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను తపన పడింది దీనికోసమేనన్నారు. ఈ పంటలు, ధాన్య రాశులు, బంగారు రాశులను కాపాడుకొనేందుకు లక్ష కల్లాలు మంజూరు చేసినట్టు చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా రైతులకు ఇలా చేసిందా?అని ప్రశ్నించారు. ఇంకా విస్తరిస్తామన్నారు. ప్రతి రైతుకు కల్లం ఉండాలన్నారు. తామేవిూ ఓట్ల కోసం, ఎన్నికలకు ముందు వచ్చి చెబుతున్న మాటలు కాదని, పటిష్టమైన ఆలోచనతో రైతాంగం అద్భుతంగా తయారు కావాలని ఇదంతా చేస్తున్నామన్నారు. దేశానికి దిక్సూచిగా, ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను చూడాలనే కలతోనే ముందుకెళ్తున్నట్టు కేసీఆర్‌ చెప్పారు.

కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్‌

మన దేశంలో రాష్ట్రాలు రాయితీలు ఇస్తామంటే కేంద్రం ఒప్పుకోవట్లేదని, రైతులకు ఎక్కువ ధర ఇస్తే విూ ధాన్యం తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెబుతోందని వివరించారు. రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలని సూచించారు. రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ”మేడ్చల్‌ జిల్లాలో మొన్న కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇవాళ కొడకండ్లలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవు. అన్ని దేశాల్లోనూ రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైతులు కూర్చుని మాట్లాడుకునేందుకు కనీసం జాగా కూడా లేదు. మన రాష్ట్రంలోనే రైతు వేదికలు నిర్మించుకున్నాం” అని సీఎం తెలిపారు.

Other News

Comments are closed.