దర్శకురాలు జయకు పలువురు నివాళి

ఆమె మృతిపై సిని ప్రముఖుల దిగ్భాంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): గుండెపోటుతో కన్నుమూసిన తెలుగు సినీ దర్శకురాలు బి.జయకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌, వంశీ పైడిపల్లి, సుకుమార్‌, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్‌, గుణశేఖర్‌, నృత్యదర్శకుడు శేఖర్‌, మంచుమనోజ్‌ తదితరులు శ్రద్దాంజలి ఘటించారు. జయ కుటుంబసభ్యులను పరామర్శించారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన స్వగృహంలో జయ గుండెపోటుతో మరణించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజు భార్య బి. జయ గత రాత్రి పదకొండు గంటల సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె ఆనంద బ్రహ్మ అనే కథ రాసింది. దానికి కేంద్ర సాహిత్య అకాడవిూ అవార్డ్‌ వచ్చింది. ఎన్నో కథలు రాసిన జయ కాలమిస్ట్‌ , కార్టూనిస్ట్‌ గా కూడా పని చేశారు. టాలీవుడ్‌ మహిళా దర్శకులలో జయది ప్రత్యేక స్థానం.2003లో చంటిగాడు సినిమాతో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన జయ చివరిగా వైశాఖం సినిమాకి డైరెక్షన్‌ చేశారు. జయ మరణం కలిచి వేస్తుందని క్రిష్‌ జాగర్లమూడి ట్వీట్‌ చేశారు. జయ మరణ వార్తని నమ్మలేకపోతున్నాను. అంత మంచి వ్యక్తి ఇంత తొందరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఈ సమయంలో జయ భర్తకి, వారి కుటుంబ సభ్యులకి మనో ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్దిస్తున్నాను అని రకుల్‌ ట్వీట్‌ లో తెలిపింది.