దాడిఘటనలో బీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్‌ రెడ్డి అనుచరుడు

` కేటీఆర్‌తో పలుమార్లు సంప్రదింపులు
` పోలీసుల అదుపులో 55 మంది
హైదరాబాద్‌,నవంబర్‌12(జనంసాక్షి): ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, పలువురు అధికరాఉలపై దాడి బిఆర్‌ఎస్‌ కుట్రగా బయటపడుతోంది. దాడిలో పల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనక బీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు బోగమోని సురేష్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లిన బోగమోని సురేష్‌.. గ్రామస్థులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బోగమోని సురేష్‌ దాడి జరగడానికి ముందు నరేందర్‌ రెడ్డితో 42 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు కనుగొన్నారు. అదే సమయంలో నరేందర్‌ రెడ్డి.. సురేష్‌తో మాట్లాడుతూనే కేటీఆర్‌కు ఫోన్లు చేసినట్లు తేల్చారు. బోగమోని సురేష్‌పై రేప్‌ సహా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లగచర్లలో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. లగచర్ల ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి సవిూక్షించాలని ఏడీజీ మహేష్‌ భగవత్‌ను డీజీపీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఏడీజీ మహేష్‌ భగవత్‌ సవిూక్షించారు. అనంతరం ప్రభుత్వానికి ఆయన సమగ్ర నివేదకను అందించనున్నారు. అందుకోసం ఇప్పటికే మహేశ్‌ ఎం భగవత్‌ వికారాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ దాడి ఘటనలో ఏడీజీ నివేదికే అత్యంత కీలకం కానుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. అందులోభాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబుతో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఐజీ సమాశమయ్యారు. సోమవారం దాడి ఘటనపై వారి నుంచి మంత్రి శ్రీధర్‌ బాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో.. బీఆర్‌ఎస్‌ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ దాడి కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లగచర్ల దాడిలో ప్రధాన నిందితులు సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్టియ్రల్‌ కారిడార్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులోభాగంగా కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం.. దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కార్యక్రమం కోసం ఉదయమే.. జిల్లా కలెక్టర్‌ ప్రతీక జైన్‌తోపాటు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు దుద్యాలకు వచ్చారు. కానీ గంట సేపే వేచి చూసినా.. ఆయా గ్రామస్తులు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇంతలో జిల్లా కలెక్టర్‌ వద్దకు స్థానిక బీఆర్‌ఎస్‌ నేత సురేశ్‌ వచ్చారు. రైతలంతా లగచర్లలో విూ కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు 5 కిలోవిూటర్ల దూరంలో ఉన్న లగచర్లకు వెళ్లారు. స్థానిక రామాలయం వద్ద రైతులతో జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. అదే సమయంలో దాదాపు 20 నుంచి 30 మంది జిల్లా కలెక్టర్‌ వైపు దూసుకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్‌ వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రతీక్‌ జైన్‌ను.. ఆయన కారు వద్దకు తీసుకు వెళ్లారు. ఇక అదే సమయంలో ఇతర ఉన్నతాధికారులపై దాడి చేసేందుకు వారు ముందుకు కదిలారు. వారిని సైతం జిల్లా కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ఇంతలో వ్యక్తిగత సిబ్బంది.. వెంటనే జిల్లా కలెక్టర్‌ను కారులో ఎక్కించారు. అదే సమయంలో ఆ కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే అడిషనల్‌ జిల్లా కలెక్టర్‌ లింగ్యా నాయక్‌తోపాటు స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకట్‌ రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారు దాడి నుంచి తప్పించు కోనేందుకు పంట చేలోకి పారిపోయారు. ఇంతలో సమాచారం అందడంతో.. లగచర్లకు పోలీసులు వచ్చారు. దీంతో ఈ ఇద్దరు ఉన్నతాధికారులను పోలీసులు రక్షించారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులపై దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు నిరసన బాట చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
పోలీసుల అదుపులో 55 మంది
ఔషధ(ఫార్మా) పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ నిమిత్తం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న నిర్వహించ తలపెట్టిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది.