దేశంలోనే తెలంగాణ వ్యవసాయశాఖకు గుర్తింపు 

– అద్భుతమైన పనితీరే ఇందుకు కారణం
– ఉత్పాదకత పెరిగితేనే రైతులకు లాభం
– ఉత్పాదకత పెంపుపై అందరూ దృష్టి పెట్టాలి
– 30లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించాం
– 417 మంది మృతిచెందగా.. 306మంది నగదు జమచేశాం
– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్యాలయాన్ని ప్రారంభించిన పోచారం, గుత్తా
హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : తెలంగాణ ప్రభుత్వం, అధికారుల అద్భుత కృషి వల్ల దేశంలోనే  రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.  జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్యాలయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అద్భుతమైన పనితీరుతో తెలంగాణ వ్యవసాయ శాఖకు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతు సమన్వయ సమితిలో అంతా రైతు కుటుంబాలకు చెందిన, రైతుల కష్టాలు తెలిసిన వారే ఉన్నారని తెలిపారు. స్వాతంత్యం వచ్చినప్పుడు దేశంలో పంటల ఉత్పత్తి 50 మిలియన్‌ టన్నులు ఉండగా నేడు 300 మిలియన్‌ టన్నులకు పెరిగిందన్నారు. ఉత్పత్తి పెరిగింది కాని సగటు ఉత్పాదకత అనుకున్నంత స్థాయిలో పెరగలేదన్నారు. ఉత్పాదకత పెరిగితేనే రైతులకు లాభం, ఉత్పాదకత పెంపుపై అందరూ దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పంట పెట్టుబడి కింద సంవత్సరానికి ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతులకు ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో రైతుల కోసం ఇంత భారీ ఎత్తున జీవితబీమాను అమలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని చెప్పారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించామన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన రైతుల సంఖ్య 417 అయితే, 306 మంది రైతుల కుటుంబ సభ్యుల నామినీ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 5 లక్షల చొప్పున జమ చేశామని మంత్రి పోచారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ యం జగన్మోహన్‌, ఉద్యానశాఖ డైరెక్టర్‌ యల్‌. వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్లు పాల్గొన్నారు.