దేశం తీర్థం పుచ్చుకోనున్న డిసిసి కార్యదర్శి

సంగారెడ్డి, నవంబర్‌ 15 : ఈ నెల 18న మధ్యాహ్నం మూడు గంటలకు బిడిఎల్‌ శంకర్‌పల్లి వద్ద జరిగే తెలుగుదేశం పార్టీ సభలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం రామాయంపేటకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ డిసిసి కార్యదర్శి తిరుపతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారంనాడు మెదక్‌  ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 65 సంవత్సరాల వయస్సులో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేయడాన్ని ఆకర్షించి దేశంలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఉందా లేదా అన్న మీమాంసంలో ఉందని అన్నారు.  దేశం నాయకులు వెంకటరమణ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుతో సన్నిహితం ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులకు భయపడి పార్టీ విడడంలేదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. తన సేవలను గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ తనను డిసిసి కార్యదర్శిగా నియమించిందని అన్నారు. టేలిఫోన్‌ బోర్డు మెంబర్‌కు పదవులకు రాజీనామా చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి ఫ్యాక్స్‌ ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశంలో ఎమ్మెల్యే పదవి కోసం వెళ్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా టిడిపి అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా వారి గెలుపుకు తన సహాయసహకారాలు ఉంటాయన్నారు. తాను సామాన్య కార్యకర్తగా దేశంలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.