దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి
స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) :
దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్‌ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ఆకాంక్షించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. గాంధీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ల త్యాగాలను ఆయన స్మరించారు. యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశప్రగతిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. అభివృద్ధిలో, ఆధునికతలో మరింత పురోగమించాలని, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకొని దేశ అభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. పేదరికం, ఆకలి కేకలు, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. దేశం నుండి ఆకలి, పేదరికాన్ని పారద్రోలేందుకు రెండో స్వాతంత్య్ర పోరాటం చేపట్టాలన్నారు. స్వాతంత్య్రం రాకముందు మన దేశం ఆర్థికంగా ఎంతో పరిపుష్టిని సంతరించుకొని ఉండేదన్నారు. ప్లాసీ యుద్దానికి ముందు మన దేశ ఉత్పాదక శక్తి 24.5కాగా బ్రిటన్‌ ఉత్పాదక శక్తి కేవలం 1.9 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువుల్లో ప్రతి నాలుగింట ఒకటి భారతదేశానికి చెందిందే ఉండేదన్నారు. అయితే పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం కారణంగా బ్రిటన్‌ 18.5 శాతానికి అక్కడి నుండి 100 శాతానికి తన సామర్థ్యాన్ని పెంచుకొందని, అయితే మన దేశ ఉత్పాదక శక్తి మాత్రం 1.7కి పడిపోయిందని భాదను వ్యక్తం చేశారు. కాగా ఎన్నో క్లిష్టమైన
పరిస్థితులను దాటుకుని వచ్చామని, అంతర్జాతీయ సమాజాన్ని మాంద్యం రెండుసార్లు కుదిపివేసినా తట్టుకొని నిలబడ్డామని, గత ఏడేళ్లుగా వృద్ధిరేటు 8 శాతానికి పైగానే ఉందని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ఎదురయిన ఎన్నో సవాళ్లను అధిగమించామని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొనేందుకు పునాదులు నిర్మించుకొన్నామన్నారు. ఐతే ఆ పునాదులపై బంగారు సౌధాన్ని నిర్మించుకొనేందుకు మనం రెండో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. దేశ 18వ స్వాతంత్య్ర సంబరాల వేడుకల సమయంలో ప్రజాస్వామ్యానికి ఆర్థికాభివృద్ధి ఓ పరీక్ష అన్న మాటను గుర్తుచేసుకుంటూ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువత తమ ప్రతిభకు పదును పెట్టి ముందుకు సాగాలన్నారు. చదువు ఓ విత్తనమైతే ఆర్థికం ఓ మధురమైన ఫలమని పేర్కొన్నారు. మౌళికసదుపాయాలు, విద్యాఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని, దీనికి ప్రభుత్వాలు కృషిచేయాలని సూచించారు. తీవ్రవాదం, ఉగ్రవాదం నిర్మూలన దేశాల మద్య పరస్పర సహకారంతోనే సాధ్యమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఆకాంక్షలకు ప్రతిరూపంగా పార్లమెంట్‌ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు. తాను నిరాశావాదిని కానని, ఆశావాదినని, దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ పుంజుకుంటుదన్న నమ్మకం తనకు ఉందన్నారు. 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం సుఖసంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భగవంతులు ఆశీస్సులు ఎల్లవేలలా ఉండాలని కోరుకుంటూ జైహింద్‌ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.