దేశ వ్యాప్తంగా రక్షా బంధన్‌ సంబురాలు

ఢిల్లీలో రాఖీలు కట్టించుకున్న రాష్ట్రపతి, ప్రధాని
హైదరాబాద్‌లో గవర్నర్‌, సీఎం
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి తమ ఆత్మీయతను పంచారు. అదే విధంగా మగవాళ్లు తమ తోడ బుట్టిన వారికి పలు కానుకలిచ్చి ఆశీర్వా దాలిచ్చారు. ఈకోలాహలం దేశ పాలకులు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీకి, తన నివాసంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పలువురు సొంత పార్టీ మహిళా నాయకులు, వివిధ పాఠశాలల చిన్నారులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా నాయకులు వారికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో గవర్నర్‌ నరసింహన్‌కు మహిళలు, విద్యార్థులు రాఖీలు కట్టారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులు తొలుత గవర్నర్‌ నరసింహన్‌కు ఆయన సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి రాఖీ కట్టారు. స్వీటు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్‌ మాట్లాడుతూ అందరూ ఆయురారోగ్యాలతో పది కాలాలపాటు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. రక్షాబంధన్‌ పవిత్రత వర్ణించనలవి కానిదన్నారు. అందరం సమభావంతో మెలగాలని కోరుకుంటున్నానన్నారు. ఇదిలా ఉండగా బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు, మహిళలు సందడి చేశారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి రాఖీలు కట్టారు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, పి.సబితా ఇంద్రారెడ్డి, మరికొందరు మంత్రులు, మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి, తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. రాఖీలు కట్టారు. అలాగే ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో 666 అడుగుల రాఖీ ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. విద్యార్థులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో కేసీఆర్‌కు మెదక్‌ ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావుకు ఆయన సోదరి, జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత రక్షబంధన్‌ ధరింపజేశారు.
జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల..
ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన తల్లి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, భారతిరెడ్డి,జగన్‌ సోదరి షర్మిల గురువారంనాడు ములాఖత్‌ సమయంలో కలిశారు. ఈ సందర్భంలో షర్మిల తన సోదరునికి రాఖీ కట్టారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొండా సురేఖ రాఖీ కట్టారు. గురువారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించారు. వైఎస్‌ సమాధికి నివాళులర్పించారు. అనంతరం రాఖీ ధరింపజేశారు.