ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మరోరైతు గుండె

share on facebook


` జమ్మికుంటలో ధాన్యం సేకరణ కేంద్ర వద్ద గుండెపోటుతో రైతు మృతి
జమ్మికుంట,డిసెంబరు 7(జనంసాక్షి):ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రైతు ఐలేశం(55) నెలరోజుల క్రితం ధాన్యాన్ని విక్రయించేందుకు సింగిల్‌ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. ధాన్యం తేమగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేయలేదు. దీంతో రోజూ అక్కడికి వచ్చి ధాన్యాన్ని ఆరబోసుకొని కొనుగోలు చేపట్టాలని సింగిల్‌ విండో అధికారులకు కోరుతూ వచ్చాడు. రోజూలాగే ఇవాళ కేంద్రానికి వచ్చిన ఐలేశం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ స్థానిక భాజపా నాయకులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించొద్దంటూ కుటుంబసభ్యులు వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం అధికారులు, పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్‌ ఆర్డీవో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే తన భర్త మృతి చెందాడంటూ ఐలేశం భార్య లక్ష్మి.. ఆర్డీవో ఎదుట వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జమ్మికుంట సీఐ రామచందర్‌రావు తెలిపారు.గతంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపైనే ప్రాణాలు విడిచాడు. తెల్లవారుజామున తోటి రైతులు చూసే సరికి చనిపోయి ఉండటంతో అందరూ ఆవేదన చెందారు.

 

Other News

Comments are closed.