నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ చౌకధరల దుకాణాల బంద్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు చౌకధరల దుకాణాలు బంద్‌ పాటించారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పలు మండలాల్లోని డీలర్లు పాల్గొన్నారు.