నగరంలో గుజరాత్‌ పర్యాటక శాఖ కార్యాలయం

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా గుజరాత్‌కు వచ్చే పార్యటకుల సంఖ్య పెరుగుతండటంతో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ యాత్రికులను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలను ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లోని బాలయోగి పర్యాటక భవన్‌లో గుజరాత్‌ యాత్రికుల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని గుజరాత్‌ టూరిజం చైర్మన్‌ కమలేష్‌ పటెల్‌, కమిషనర్‌ సంజయ్‌ కౌల్‌ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్‌షోలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ కమలేష్‌ తెలిపారు. త్వరలో గుజరాత్‌లో జరుగనున్న సపుతర మాన్‌సూన్‌ ఫెస్ట్‌, తర్నేతార్‌ ఫెయిర్‌,నవరాత్రి ఫెస్టివల్‌, రన్‌ ఉత్సవ్‌కు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే గుజరాత్‌లోనూ అనేక పర్యాటక ప్రాంతాలున్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రధాన కార్యదర్శి చందనాఖాన్‌ అన్నారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన గుజరాత్‌ నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.