నగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, జూన్‌ 17 : నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, లింగపల్లి, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, కాప్రా, రామంతపూర్‌, మసాబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, పాతబస్తీలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో వాహనదారులకు అసౌకర్యం కలిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం నాలుగు నుండి ఏడుగంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వర్షం ధాటికి నగరంలో రెండు గంటలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.