నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

14 మంది మృతి..
ముగ్గురికి తీవ్రగాయాలు
నల్గొండ, జూలై 24 (జనంసాక్షి):
జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కముం తలపాడు వద్ద మంగళవారం సాయంత్రం సిమెంటు లారీ బోల్తా పడిన దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. దామరచర్ల నుంచి సిమెంటు బస్తాల లోడుతో హైదరాబాద్‌ వస్తున్న లారీ నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఉన్న మలుపు వద్ద అదుపు తప్పి సిమెంటు లారీ బోల్తా పడింది. దీంతో సిమెంటు బస్తాలపై కూర్చున్న వారు వాటి కింద పడడంతో అక్కడికక్కడే 14 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో కొందరు హాలియా మండలం రంగూడ్ల గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. మరికొందరు మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సంఘటన స్థలానికి ఆర్డీవో, డిఎస్‌పి, తదితరులు చేరుకున్నారు. సిమెంటు బస్తాల కింద మరో రెండు మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు. సిమెంటు బస్తాల తొలగింపు ప్రక్రియ కొనసాగు తోంది. ఇదిలా ఉండగా మృతులంతా మిర్యాలగూడ వద్ద సంతకు వెళ్లి తిరిగి ఇళ్లకు వస్తూ ఈ లారీ ఎక్కారు. సిమెంటు బస్తాలపై కూర్చుని ప్రయాణించడంవల్లే అధిక సంఖ్యలో మృతులున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, ప్రయాణికులు అతడ్ని పలుమార్లు హెచ్చరించారన్నారు. మలుపు వద్ద అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.