నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌లో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో దాదాపు 700మంది పోలీసులు సాగర్ డ్యామ్‌పైకి చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.