నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య


పార్లమెంట్‌ ఆవరణలో మొక్కనాటిన నాయుడు
ఉపరాష్ట్రపతి హోదాలో పలు కార్యక్రమాల నిర్వహణ
వివిధ కార్యక్రమాల సమాచారంతో ఈ `బుక్‌ విడుదల
న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. బుధవారం నాటితో ఆయన నాలుగేళ్లుగా ఉపరాష్ట్రపతి హోదాలో కొనసాగుతున్నారు. రాజ్యసభ చైర్మన్‌ గా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొక్కనాటారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాదిలో ఆయన చేపట్టిన, హాజరైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్లిప్‌ బుక్‌ను (ఈ`బుక్‌) విడుదల చేసింది. వివిధ భారతీయ భాషల్లో విడుదలైన ఈ`బుక్‌లో గతేడాది పది రాష్టాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న 133 కార్యక్రమాల కు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా వివరించారు. గతేడాది ఉపరాష్ట్రపతి వివిధ వేదికలపై 53 ప్రసంగాలను ఇవ్వగా, 23 పుస్తకాలను ఆవిష్కరించారు. 21కి పైగా విద్య, విజ్ఞాన, వ్యవసాయ సంస్థలను సందర్శించడంతోపాటు 7 ప్రముఖ విద్యాసంస్థల స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు 4 అవార్డు ప్రదాన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. గతేడాది కరోనా కారణంగా,
ఆరోగ్య సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచడంతోపాటు, భవిష్యత్తులో అంతా సర్దుకుంటుందనే విశ్వాసాన్ని వారిలో కల్పించేందుకు వివిధ భారతీయ పత్రికల్లో వ్యాసాలు, ఫేస్‌బుక్‌ పోస్టుల ద్వారా ఉపరాష్ట్రపతి తమ వంతు ప్రయత్నం చేశారు. కరోనాపై పోరాటంలో ముందువరసలో ఉన్న యోధులను కూడా వ్యాసాలు, ఫేస్‌బుక్‌ పోస్టుల ద్వారా నిరంతరం ప్రశంసిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు.కరోనాకు టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రారంభంలోనే టీకా తీసుకుని, టీకాకరణపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా కరోనాకు దేశీయంగా టీకాను రూపొందించిన భారత్‌ బయోటెక్‌ కేంద్రాన్ని సందర్శించి, శాస్త్రవేత్తలను, సంస్థ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భారతీయుల్లోని ధైర్యసాహసాలను ప్రతిబింబించే స్ఫూర్తివంతమైన గాథలను గుర్తుచేసుకుంటూ, భారత స్వాతంత్య సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసినా అంతగా గుర్తింపు పొందని 26 మంది వీరనారీమణుల సాహసాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్‌ పోస్టులు రాశారు. దీంతోపాటుగా స్వాతంత్య సంగ్రామంలో ఆంగ్లేయుల కంటిలో నలుసుగామారి, అండమాన్‌ సెల్యులార్‌ జైల్లో క్రూరమైన చిత్రహింసలను అనుభవించిన విప్లవ వీరుల గురించి కూడా ఫేస్‌బుక్‌ పోస్టులు రాశారు. ’ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ ఉత్సవంలో భాగంగా దండి సత్యాగ్రహ వార్షికోత్సవాన్ని స్మరించుకుంటూ గుజరాత్‌లోని దండిని సందర్శించి, 25 రోజులపాటు జరిగిన కార్యక్రమాల ముగింపు ఉత్సవంలో పాల్గొని, భరతజాతి ఐకమత్యం ద్వారా సాధించిన విజయాలను గుర్తుచేశారు. మాతృభాషలను ప్రోత్సహించేందుకు ఉపరాష్ట్రపతి తలపెట్టిన భాషాయజ్ఞంలో భాగంగా, గతేడాది జరిగిన దాదాపు ప్రతి కార్యక్రమంలో మాతృభాష పరిరక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజు 22 భారతీయ భాషల్లో ట్విట్టర్‌ వేదికగా తమ సందేశాన్ని అందించడంతో పాటు, అమ్మభాషను సంరక్షించుకోవలసిన అవసరాన్ని పేర్కొంటూ 24 ప్రాంతీయ భాషల్లో వ్యాసాలు రాశారు. మాతృభాషలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని, అందులో ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిన బాధ్యతను పేర్కొంటూ, పార్లమెంటు సభ్యులందరికీ వారి వారి భాషల్లో లేఖలు రాశారు. దీంతోపాటుగా ఈ ఏడాది సంప్రదాయ నూతన సంవత్సరం సందర్భంగా మరో సారి ఎంపీలకు వారి మాతృభాషల్లో లేఖల ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. ఉన్నత, వృత్తి విద్యల్లో భారతీయ భాషల్లోనే విద్యాబోధన జరిపేందుకు అఖిల భారతీయ సాంకేతిక విద్యామండలి నిర్ణయించడం, దేశవ్యాప్తంగా 14 కళాశాలలు ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని అభినందిస్తూ, తద్వారా భవిష్యత్తులో వచ్చే మార్పులను పేర్కొంటూ 24 ప్రాంతీయ భాషల్లోని 33 పత్రికల్లో వ్యాసాలు రాశారు.విద్య, విజ్ఞాన, వ్యవసాయ, సాంకేతిక రంగాల్లో భారతీయుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టిలేపాల్సిన అవసరాన్ని, ఈ సామర్థ్యాలను అనుసంధానం చేస్తూ, భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయం ప్రాధాన్యత, ఈ దిశగా చేయాల్సిన మరింత కృషిని నొక్కిచెప్పారు. కరోనా సమయంలోనూ రికార్డుస్థాయిలో ఉత్పత్తి చేసిన అన్నదాతలను ఉపరాష్ట్రపతి అభినందించారు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌ (డీఆర్డీవో), సీసీఎంబీ, ఐఐటీ`మద్రాస్‌ వంటి ఉన్నత సాంకేతిక, పరిశోధన సంస్థలను కూడా ఉపరాష్ట్రపతి సందర్శించారు. బహెరైన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అబ్దుల్‌ లతీఫ్‌ బిన్‌ రషీద్‌ అల్‌ రaయానీ, ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) అధ్యక్షుడు శ్రీ దుఆర్టే పచేకోలతో ఉపరాష్ట్రపతి నివాసంలో సమావేశమయ్యారు. రాజ్యసభ చైర్మన్‌గా.. సమర్థవంతంగా సభాకార్యక్రమాల నిర్వహణ, ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి వారు నిరంతరం కృషిచేశారు. లోక్‌సభ స్పీకర్‌తో కలిసి
కరోనా సమయంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో 44 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి. వివిధ రాజ్యసభల కమిటీలు 74 నివేదికలను అందజేశాయి. ఈ నాలుగేళ్లలో ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య, కమిటీల నివేదికల్లో ఇవే అత్యధికం. దీంతోపాటుగా రాజ్యసభ అధికారిక వార్తాస్రవంతి రాజ్యసభ టీవీ శాశ్వత వీక్షకుల సంఖ్య, ఈ నాలుగేళ్లలో 5 లక్షలనుంచి 59 లక్షలకు పెరిగింది. దీంతోపాటుగా రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలను విలీనం చేస్తూ ’సాంసద్‌ టీవీ’ని ఏర్పాటుచేసే అంశంపై కమిటీ ఏర్పాటుచేసి ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.