నిజామాబాద్‌లో పతంజలి పార్కు

 

-రాందేవ్‌బాబాతో కవిత భేటి

నిజామాబాద్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి):దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్‌ ఆహార శుద్ధి కేంద్రాన్ని (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌) నిజామాబాద్‌ జిల్లా లక్కంపల్లిలో నిర్మించనున్నారు. నేడు ప్రభుత్వ అధికారుల బృందంతో ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌ వెళ్లిన నిజామాబాద్‌ ఎంపీ కవిత పతంజలి కేంద్ర కార్యాలయంలో బాబా రాందేవ్‌, ఆచార్య బాలక్రిష్ణతో సమావేశమయ్యారు. అవగాహన ఒప్పందంపై పై పతంజలి గ్రూప్‌ బాధ్యులతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.లక్కంపల్లిలో పెద్ద యెత్తున ఏర్పాటుచేయబోయే ఆహార శుద్ధి కార్మాగారంలో పసుపు, మిర్చీ, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాల్ని, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పతంజలి యునిట్లకు సరఫరా చేస్తారు. దీనివల్ల పతంజలి సంస్థకు కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు తదితర నాణ్యమైన ధాన్యాల్ని పెద్ద మొత్తంలో ఒకేచోట దొరుకుతాయి. అనేక మందికి ప్రత్యక్షంగా ఈ కర్మాగారంలో ఉపాధి దొరకడంతో పాటు ఈ ప్రాంత రైతులకు తాము పండించిన ధాన్యాన్ని ఒకేసారి అమ్ముకోవడం వీలవుతుంది. దీంతో పాటు దళారుల చేతిలో మోసపోతున్న రైతులకు నేరుగా కంపెనీయే ధాన్యాన్ని సేకరించడంతో మద్దతు ధర దొరుకుతుంది.పసుపు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మంచి స్థానంలో ఉండడంతో ఆయుర్వేద మరియు ఆహార ఉత్పత్తులను పెద్ద యెత్తున తయారు చేస్తున్న పతంజలి గ్రూప్‌ ను ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాల్సిందిగా నిజామాబాద్‌ ఎంపీ కవిత కోరారు. కవిత ఆహ్వానం మేరకు గత నవంబర్‌ లో నిజామాబాద్‌ వచ్చిన పతంజలి గ్రూప్‌ సీఈఓ ఆచార్య బాలక్రిష్ణ ఇక్కడి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హరిద్వార్‌ లోని బాబా రాందేవ్‌ తో చర్చించి తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకునేందుకు అధికారులతో రావలసిందిగా ఎంపీ కవితను కోరారు.ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, టీఎస్‌ ఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నరసింహరెడ్డి, నందిపేట్‌ మండల స్థానిక ప్రజాప్రతినిధులు హరిద్వార్‌ వెళ్లిన వారిలో ఉన్నారు. అనంతరం హరిద్వార్‌ లో తమ వస్తూత్పత్తి కేంద్రాన్ని, ప్యాకింగ్‌ యూనిట్లను, పరిశోధన విభాగాలను, మందుల తయారీ కేంద్రాలను కవితకు బృందంలోని ఇతర సభ్యులకు చూపించి, అక్కడి పద్దతులను వివరించారు.