నియోజకవర్గానికో ఐటీఐ కళాశాల

ఆగస్టు 13 నుంచి 21 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్‌
ఉపాధి, శిక్షణశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు ప్రభాకర్‌
శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఉపాధి, శిక్షణశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు జె.వి.ప్రభాకర్‌ అన్నారు. ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో 1961 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారాన్నరు. ఈ ఏడాది ఐటీఐల్లో ప్రవేశాలను ఆగస్టు 13 నుంచి 21వ తేదీ వరకు గ్రేడుల ఆధారంగా చేపడతామన్నారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం శ్రీకాకుళం జిల్లాలో 5,155 మంది దరఖాస్తులు తీసుకుని 2,895 మంది కళాశాలల్లో సమర్పించారన్నారు. ప్రభుత్వ ఐటీఐలు లేని నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఉపాధి, శిక్షణశాఖ ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం, ఇచ్ఛాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో కొత్తగా ప్రభుత్వ ఐటీఐలు ఏర్పాటునకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఒక్కో ఐటీఐకి 5 ఎకరాలు స్థలం ఉండాలన్నారు. సీతంపేట ఐటీఐకి వసతిగృహం ఏర్పాటునకు రూ. 80 లక్షలు, అదనపు తరగతి గదులుకు రూ. 30 లక్షల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్‌ రాడ కైలాసరావు, శ్రీకాకుళం డీఎల్‌టీసీ ఏడీ మల్లేసు, రాజాం కళాశా ప్రిన్సిపల్‌ భాస్కరరావు, రఘురాం తదితరులు ఉన్నారు.