నేడు సారలమ్మ ఆగమనం


` మేడారం జాతరలో జనసందడి
` భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ములుగు(జనంసాక్షి):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క ` సారలమ్మ మహా జాతర మొదలయ్యింది. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కతం కానుంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి రానున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గోవింద రాజు, పగిడిద్ద రాజులు కూడా గద్దెలకు చేరుకుంటారు. అలాగే గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం కానుంది. మరుసటి రోజు అనగా శుక్రవారం(జనవరి 30) భక్తులు సమ్మక్క ` సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారంసాయంత్రం సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది. మేడారం మహా జాతర తెలంగాణ సంస్కతి, గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. జనాల గుడారాలతో మేడారం కిటకిటలాడుతోంది. భక్తులు బెల్లం(బంగారం) సమర్పిస్తూ ఆచారాలు పాటిస్తున్నారు. మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రభుత్వం తాజాగా గ్దదెలను పునర్నిర్మాణం చేసింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రవాణా, నీరు, వైద్యం, భద్రతా ఏర్పాట్లు చేశారు.మేడారం సమ్మక్క`సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా నేరుగా వాగు వద్దకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వచ్చే ప్రతి భక్తుడు ముందుగా జంపన్న వాగును సందర్శించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాతే అమ్మవార్ల గద్దెల దర్శనానికి వెళ్లడం సంప్రదాయం. భక్తులు తమ వెంట తెచ్చుకున్న అమ్మవారి ప్రతిమలను వాగులో పవిత్రంగా కడిగి, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్ల వద్ద ప్రతిష్టించుకున్న గద్దెలను మేడారం తీసుకువచ్చి, ఇక్కడ జంపన్నకు మొక్కులు అప్పగిస్తారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కతజ్ఞతగా ’ఎత్తు బంగారం’ అంటే తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన వెదురు లంకలను (ఎదురు కర్రలు) పట్టుకుని భక్తిపాటలు పాడుతూ భక్తులు చేసే సందడి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.