ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు
` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా
` ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం దిశగా కదులుతున్నాయని పేర్కొన్నారు. వాటిని వినియోగించే అవసరం రాకూడదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే యూఎస్‌కు చెందిన విమాన వాహకనౌక యూఎసఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని యుద్ధనౌకల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ‘ప్రస్తుతం మరో అందమైన యుద్ధనౌక ఇరాన్ వైపు ప్రయాణిస్తోంది. వారు ఒక ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పటికే వారు దాన్ని చేసుకోవాల్సి ఉంది. అయితే అందుకు వారు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. వాళ్లు నాకు చాలాసార్లు ఫోన్ చేశారు’ అని ట్రంప్ అన్నారు.అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అబ్రహం లింకన్ వాహక నౌకతో సహా పలు యుద్ధ నౌకలను పశ్చిమాసియాలో మోహరించారు. దీంతో ఇరాన్‌పై యూఎస్ ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
ఈయూతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌కే లాభం
` అమెరికా
వాషింగ్టన్(జనంసాక్షి):భారత్` ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం భారత్‌కే ఎక్కువ అనుకూలంగా ఉందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో గ్రీర్ మాట్లాడుతూ.. ‘ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని వివరాలు నేను పరిశీలించా. దీనిలో భారతదేశం పైచేయిగా నిలుస్తుందని భావిస్తున్నా. ఐరోపా మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ ఉత్పత్తులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తుండటంతో.. పలు దేశాలు తమ ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఈయూ.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందన్నారు.


