నిరుపేదలకు భూమి పట్టాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 : జిల్లాలోని ఆర్మూర్‌ మండలం పెర్కిడ్‌  గ్రామంలో నిరుపేదలు అక్రమించుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతూ, సిపిఐఎంఎల్‌ న్యూడెమొక్రసి, సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. 206, 445, 446 సర్వే నంబర్లలో  23 ఎకరాల భూమిని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసుకొని ఇళ్ల స్థలాలు మార్చి విక్రయించడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని ఈ భూమిని నిరుపేదలకు పంచిపెట్టాలని కలెక్టర్‌కు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. న్యూడెమొక్రసి ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి ప్రభాకర్‌ మాట్లాడుతూ,  పేదలకు ఈ భూమిని అందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆ స్థలంలో మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాలను నిర్మించే యత్నం చేస్తున్నారని అన్నారు. ఈ భూమిని పేదలకే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.