నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌కు గట్టి పోటీ

గెలుపు అంత సులువు కాదన్న రీతిలో ప్రచారం
మంత్రికి గట్టిపోటీని ఇస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు
నిర్మల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : నిర్మల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మరోమారు తన అదృష్టం పరీక్షించుకోబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కూచాడి శ్రీహరి రావుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. గెలుపు కోసం హోరా హోరీ తలపడుతున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రజలతో తనకున్న సాన్నిహిత్యం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆశలు పెట్టుకుంటున్నారు. మైనార్టీ ఓట్లు సైతం తనకే పడుతాయంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావు ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై నమ్మకంతో ముందుకెళ్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే ప్రచారం వల్ల తనకు మైనార్టీలు, దళితుల ఓట్లు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండడంతో విజయం తనదేనని శ్రీహరి రావు ధీమాతో ఉన్నారు. మరోవైపు బీజెపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఈసారి నిర్మల్‌ కోటపై కాషాయ జెండా ఎగరేయ డమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రోజురోజుకు ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతుండడంతో ఆయన ఫుల్‌జోష్‌లో కనిపిస్తున్నారు. యూత్‌లో మోదీపై ఉన్న క్రేజ్‌, వ్యక్తిగత ఇమేజ్‌, గతంలో నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సేవా కార్య క్రమాల వల్ల మైనార్టీలు సైతం తనకు అండగా నిలుస్తారని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న బీడీ ఓటర్లపై కూడా ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఆశలు పెట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో ముగ్గురూ బలమైన ప్రత్యర్థులే కావడంతో ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, బీజేపీల అభ్యర్థులు ప్రతిరోజు ప్రచారానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ఆధారంగా ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సోషల్‌ విూడియాలో కూడా మూడు పార్టీలు అస్సలు తగ్గడం లేదు. ప్రతిరోజు కొత్త కొత్త వీడియోలను వైరల్‌ చేస్తూ తమ పార్టీల గురించే కాకుండా ప్రత్యర్థి పార్టీల లోపాలను ఎత్తిచూపుతున్నారు. తెలంగాణ ఉద్యమ పాటల రూపంలో ఈసారి మూడు పార్టీలు తమకు అనుకూలంగా పాటలను రూపొందించుకుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. నిర్మల్‌ సెగ్మెంట్‌ లో మొత్తం13 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వీరిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు.బీఎస్పీ నుంచి దేవత జగన్మోహన్‌, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా గొర్రె లింగన్న, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పరికిపండ్ల స్వదేశ్‌, అలయెన్స్‌? ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థిగా మంతెన ఇంద్రకరణ్‌ రెడ్డి, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా రవీందర్‌ రామగిరితో పాటు ఇండిపెండెంట్లుగా ఖాజా నయీముద్దీన్‌, మహమ్మద్‌, దేవోల్ల రాజు, బుర్క రాజేందర్‌, మద్దికుంట మల్లేష్‌, సుదర్శన్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరి రావు తాను ఉద్యమకారుడుగా తెలంగాణ కోసం కష్టపడ్డానని, అప్పటి టీఆర్‌ఎస్‌ లో కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిం చానని ఇవి తన గెలుపుకు సహకరిస్తాయంటున్నారు. ఉద్యమకారుడిగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి పెరిగిందంటున్నారు. బీఆర్‌ఎస్‌ పై ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకత కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఈసారి మైనార్టీలు, దళితులు గతానికి భిన్నంగా కాంగ్రెస్‌ కు భారీగా మద్దతు తెలుపుతున్నారని, తన గెలుపుకు ఈ పరిణామం దోహదం చేస్తుందంటున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఇది భారీ మెజార్టీని ఇస్తుందంటున్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీకి ఫీల్డ్‌ ?లెవెల్‌?లో క్యాడర్‌? లేకపోవడం, లక్ష్మణ చాంద, మామడ మండలాల్లో శ్రీహరి రావుకు పట్టున్నప్పటికీ.. మిగతా మండలాల్లో నాయకులు, కేడర్‌ ఆశించిన సంఖ్యలో లేకపోవడం మైనస్‌. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంద్రకరణ్‌ రెడ్డి తాను ఎంపీగా, మంత్రిగా చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయంటున్నారు. తన హయాంలో నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడడం, మెడికల్‌ కాలేజీ రావడం, సాగునీటి రంగానికి భారీగా నిధులు మంజూరు కావడం, దాదాపు 600 ఆలయాలను నిర్మించడం లాంటి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు లాంటి పథకాలు కూడా
తన గెలుపుకు ఈసారి బాటలు వేస్తాయని ఆశిస్తున్నారు.అయితే, కొద్ది రోజుల నుంచి ఇంద్రకరణ్‌ రెడ్డి తీరుపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పైనా, సీఎం కేసీఆర్‌ పైనా ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, సెకండ్‌ కేడర్‌ పై అవినీతి ఆరోపణలు రావడం, పార్టీ నాయకులు, బంధువులపై ఉన్న భూకబ్జాల ఆరోపణలు ఇంద్రకరణ్‌ రెడ్డి గెలుపుకు ప్రస్తుతం అవరోధంగా మారనున్నాయి. బీజెపీ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి తాను గతంలో చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయంటున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్‌, మారుతున్న పరిణామాలు తనను విజయతీరాలకు చేర్చుతాయంటున్నారు. బీజేపీకి యువతలో క్రేజ్‌ పెరగడం కూడా కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు. దీనికి తోడు నిర్మల్‌? నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి ఓటర్లలో బలంగా ఉందని, ఇది ఈసారి తనను గెలిపించడానికి దోహదం చేస్తుందని నమ్ముతున్నారు. మరోవైపు ఏలేటి ముక్కుసూటితనం, దూకుడుగా వ్యవహరించడం ఆయనకు ప్రతిబంధకంగా మారనున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సెగ్మెంట్‌ లో జరిగే ప్రతి ఎన్నికల్లో బీడీ కార్మికులు, మైనార్టీలు డిసైడిరగ్‌ ఫ్యాక్టర్‌ గా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు యాభై వేలకు పైగా బీడీ కార్మికులు, నలభై వేలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరు ఎక్కువగా ఎటు వైపు మొగ్గు చూపుతారో వారినే గెలుపు వరించే అవకాశం ఉంది. వీరిని ఆకట్టుకోవానికి అన్ని పార్టీల వారు ప్రయత్నిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వీరి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు.