నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ బాధ్యతలు

` ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే
` హాజరైన సీఎం రేవంత్‌, పలువురు మంత్రులు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం రaార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. రాధాకీస్ణన్‌ తెలంగాణకు ఇప్పుడు మూడో గవర్నర్‌ కావడం విశేషం. ఇప్టపి వరకు బాధ్యతలు చేపట్టిన ముగ్గురు కూడా తమిళనాడు వారే కావడం మరో విశేషం. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు భాజపా తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు భాజపా సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి రaార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తమిళిసై సౌందరరాజన్‌తోపాటు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌.. ముగ్గురూ తమిళనాడు వారే కావడం గమనార్హం.