నదీ జలాలు, ప్రాజెక్టులపై ఇక ఉద్యమమే..

` పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది
` ఫ్యూచర్‌ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్‌ దందానే
` నన్ను దూషించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది
` హిల్ట్‌ పాలసీ ఓ భూదందా
` రాష్ట్రంలో చెక్‌ డ్యామ్‌లు పేల్చివేయడం దారుణం
` భారాస అధికారంలోకి వచ్చాక కారకులు పాతాళంలో ఉన్న వెతికి కఠినంగా శిక్షిస్తాం
` బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనను దూషించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే వారి విధానంగా అర్థమవుతుందని ఆక్షేపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న ఆయన, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలిసేదని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎక్కడా అహంకార వైఖరి ప్రదర్శించలేదని కేసీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క పాలసీని కూడా తేలేదన్నారు. హిల్ట్‌ పాలసీని మాత్రం రియల్‌ ఎస్టేట్‌ కోసమే తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి, చేను వద్దకు వచ్చేదన్న కేసీఆర్‌, ఇప్పుడు ఏకంగా యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే దారుణమైన పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా, ఉన్న వాటిని ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని కేసీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరే కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్‌?ఎస్‌? హాయాంలో అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ. 2 లక్షలు ఉంటే రూ.5 లక్షలకు పెంచామన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలను కూడా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్‌ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమన్న ఆయన మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలమూరు, నల్గొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు`రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఎందుకు పడావు పెట్టారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ, రాష్ట్రంలో రైతుల సమస్యలు, ఇతర అంశాలపై చర్చలు జరుగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పలు విషయాలపై మాజీ సీఎం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడనున్నారు.