‘నెల’తప్పిన ఆజాద్‌

– డెడ్‌లైన్‌పై జాదూ వంకర మాటలు
– నెలంటే 30 రోజులు కాదట
– భగ్గుమన్న తెలంగాణ
– మిలిటెంట్‌ పోరాటాలతోనే సాధించుకుంటాం : ఓయూ జేఏసీ
– 28నే ప్రకటన చేయాలి : కోదండరామ్‌
– ఆజాద్‌ ప్రకటన ఊహించిందే : కేసీఆర్‌
– వాయిదా అన్యాయం : టీ ఎంపీలు
– నిర్ణయం మాత్రమే వాయిదా : మధుయాష్కీ
హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ మరోసారి అడ్డంగా మాట్లాడారు. నెలంటే 30 రోజులుకాదంటూ ఓ అడ్డగోలు వాదనకు తెరతీశారు. ఇలా ఆ’జాదూ’ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొంచం కదలిక వచ్చిందంటే చాలు ఆజాద్‌ శివమెత్తిపోతాడు. మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ తెలంగాణపై అడ్డగోలు వాదనలు చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ ఎంపీల ఒత్తిడితో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత నెల 28న తెలంగాణపై ఆల్‌పార్టీ మీటింగ్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు నెలరోజుల్లోగా తెలంగాణపై తేల్చేయాలంటూ కోరాయి. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న షిండే సమావేశం అనంతరం నెలరోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ మేరకు చర్యలు కూడా చేపట్టారు. అయితే అఖిలపక్షం నిర్వహించే ముందు కూడా సీమాంధ్ర నేతలు ఆజాద్‌తో ‘అంబ పలికించారు.’ కొత్తగా హోంశాఖ బాధ్యతలు చేపట్టిన షిండే అవగాహన కోసమే ఆల్‌ పార్టీ మీటింగ్‌ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు. అప్పుడు సంబరపడిన సీమాంధ్ర నేతలు, హోం మంత్రి ప్రకటన తర్వాత బెంబేలెత్తిపోయారు. షిండే ప్రకటనతో అహ దెబ్బతిన్న ఆజాద్‌ తన పంతం నెగ్గించుకోవాలన్నట్లుగానే బుధవారం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో భేటికావడం వల్ల ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని భావించాడు. నిజంగానే ఆయన వ్యాఖ్యలకు సీమాంధ్ర మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి అడ్డంకిగా ఉన్న సీమాంధ్ర మీడియా దీనిని చిలువలు, పలువలు చేసింది. తెలంగాణవాదులు ఆజాద్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల రోజులంటే నెలరోజుల్లే సమస్య పరిష్కరించాలని కాదని, ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ఆజాద్‌ చెప్పాడు. తెలంగాణ చాలా సున్నితమైన, తీవ్రమైన సమస్యంటూ సాగదీశాడు. ప్రజల ఆత్మగౌరవాన్ని పక్కదారి పట్టించేవారి కంబంధ హస్తాల్లో బందీ అయిన వాడిలా వ్యాఖ్యానించాడు. ఆయన మాటలు చూస్తే రాష్ట్రంలో సమస్య పరిష్కారం కంటే తెలంగాణ అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉండాలనే కోరుకుంటున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిలిటెంట్‌ పోరాటాలతోనే సాధించుకుంటాం : ఓయూ జేఏసీ
తెలంగాణపై ఆజాద్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఓయూ జేఏసీ మండిపడింది. ఇంతకాలం శాంతియుతంగా సాగిన పోరాటాన్ని ఇకపై మిలిటెంట్‌ తరహాలో కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మాట్లాడితే తరిమికొడతామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు.
28నే ప్రకటన చేయాలి : కోదండరామ్‌
కేంద్రం ముందుగా ప్రకటించినట్లుగా ఈనెల 20నే తెలంగాణపై ప్రకటన చేయాలని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. పదే పదే విరుద్ధమైన ప్రకటనలు చేస్తే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం పొతుందన్నారు. ఆజాద్‌లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తలెంగాణ ప్రజలను అగౌరవపర్చడమేనన్నారు.
ఆజాద్‌ ప్రకటన ఊహించిందే : కేసీఆర్‌
తెలంగాణపై కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు ముందుగానే ఊహించినవని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. అందుకే అఖిలపక్ష సమావేశం అనంతరం తాము నిరసన తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని కాంగ్రెస్‌ నేతలు కాలగర్భంలో కలిసి పోతారని హెచ్చరించారు.
వాయిదా అన్యాయం : టీ ఎంపీలు
తెలంగాణపై నిర్ణయం వాయిదా వేయడం అన్యాయమని టీ కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. ఆజాద్‌ కంటే ముందుగానే అవే వ్యాఖ్యలు టీజీ వెంకటేశ్‌ చేశారని, అంటే సీమాంధ్ర శక్తులు ఎంతగా ప్రభావం చూపుతున్నాయో అర్థమవుతుందన్నారు. తెలంగాణ సాధన కోసం మరింత ఉధృతమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
నిర్ణయం మాత్రమే వాయిదా : మధుయాష్కీ
తెలంగాణపై నిర్ణయం మాత్రమే వాయిదా పడిందని, వ్యతిరేక నిర్ణయం రాలేదని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. సీమాంధ్ర నేతలు, కుట్రలు, కుతంత్రాలతో వాయిదా వేయించారని పేర్కొన్నారు.