నేటి నుంచి రెండు పథకాల అమలు

` మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం
` సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీబస్‌ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌
` మహిళలు గుర్తింపు కార్డు చూపి ప్రయాణం చెయ్యొచ్చు : ఆర్టీసి ఎండి సజ్జనార్‌
` ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్‌(జనంసాక్షి):తొలిరోజే రేవంత్‌రెడ్డి సర్కార్‌ తన మార్కు పాలన చూపించారు. రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై సవిూక్ష చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రెండోది రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందలో భాగంగానే శనివారం సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌కి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా నారీమణులు ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. ఇక త్వరలో ప్రత్యేకమైన సాప్ట్‌వేర్‌ ఆధారిత కార్డును ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తేనుంది. అలాగే మహిళలకు సంబంధించిన చార్జీలను రీయింబర్స్‌ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. తెలంగాణ పరిధి వరకు శనివారం మధ్యాహ్నం నుంచి ఉచిత బస్సు ప్రయాణ అమల్లోకి రానుంది. అంతరాష్ట్ర బస్సులకు కూడా తెలంగాణ పరిధి వరకు ఉచితం కల్పించింది. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటీ కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చని సూచించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. అసెంబ్లీలో మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానికతకు ధ్రువీకరణకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలన్నారు. బస్‌ భవన్‌లో సజ్జనార్‌ విూడియాతో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం అమలుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌ రేపు మధ్యాహ్నం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్‌ ఇస్తారు. వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ పథకం వల్ల ప్రజా రవాణాకు మేలు జరుగుతుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో ప్రజా రవాణా తిరిగి పుంజుకుంటుం దన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సిబ్బంది నిబంధనలు జారీ చేశామన్నారు. వారం రోజుల తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళలు.. రాష్ట్రం, కేంద్రం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలన్నారు. మహిళలు బస్సు ఎక్కడైనా ఎక్కొచ్చు.. ఎక్కడైనా దిగొచ్చు. ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు అని స్పష్టం చేశారు. ఉచిత ప్రయాణాలకు ఎలాంటి పరిమితులు, షరతులు లేవని తెలిపారు. మహిళల టికెట్‌ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని చెప్పారు.  ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇది 55 శాతం దాకా వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉంది. రోజు వారి ఆదాయం రూ. 14 కోట్లు ఉంది. పథకం అమలైన తర్వాత ఆదాయం 50 శాతం తగ్గిపోతోంది. అంటే రూ. 7 కోట్ల దాకా వస్తుంది. రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. రాబోయే రోజుల్లో 1,050 కొత్త బస్సులు రాబోతున్నాయి. వెయ్యి ఎలక్టిక్ర్‌ బస్సులు తీసుకుంటున్నామని, అందులో 500 సిటీకి, 500 రూరల్‌ ఏరియాకు వస్తాయని సజ్జనార్‌ స్పష్టం చేశారు.