నేడు కేబినేట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ రెండో తేదీనే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆదివారమే కేబినేట్‌ భేటీ ఉంటుందని అంటున్నారు. దీంతో రాజకీయంగా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టిఆర్‌ఎస్‌ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముందుగానే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని, అందులో అసెంబ్లీని రద్దు చేయడానికి సిఫారస్‌ చయవచ్చని, ఆ తర్వాత గవర్నర్‌ ను కలిసి లేఖ అందించవచ్చని చెబుతున్నారు. అయితే కేవలం వివిధ అంశాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు మాత్రమే కేబినేట్‌ భేటీ జరగగలదని కూడా అంటున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంతోపాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలంటే ఇక్కడ శాసనసభను రద్దు చేస్తేనే సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. దీంతో కేబినేట్‌ ఇందుకుఅనుగుణంగా నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు లేఖ అందిస్తారని అంటున్నారు. అలా అయితే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరపడానికి అవకాశం ఉంటుంది. కెసిఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహణకు అధికార తెరాస సన్నద్ధమైన పరిస్థితుల్లో అంతకు కొద్ది సమయం ముందు జరిగే మంత్రివర్గ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలోనే శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని సభ తర్వాత మరోసారి రద్దు కోసం మంత్రివర్గ భేటీ నిర్వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. పింఛను మొత్తం పెంపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి మొదట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, తర్వాత కేవలం శాసనసభ రద్దు కోసమే ఇంకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని, మొత్తవ్మిూద 10వ తేదీలోగా శాసనసభ రద్దు పక్రియ పూర్తవుతుందని కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్న రోజునే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకొంటారా లేదా మరోసారి దీనిపై భేటీ అవుతారా అన్నదానిపై స్పష్టత రావలసి ఉంది. దీనిపై అధికారికంగా సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

 

తాజావార్తలు