‘న్యాయ’ మంత్రిగా ఉండి న్యాయ విచారణ ఎలా ఎదుర్కొంటావ్‌

ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్‌

తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్‌

హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను ఎలా ఎదుర్కొంటావని సల్మాన్‌ ఖుర్షీద్‌పై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆయన భార్య స్వచ్ఛంగా సంస్థలకు కేటాయించిన 71.5 కోట్ల నిధుల వితరణలో అవకతవకలకు పాల్పడ్డారని అన్యా బృందం మాజీ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప థ్యంలో కొన్ని రోజులుగా లండన్‌లో పర్యటించిన ఖుర్షీద్‌ ఆది వారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన  తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. న్యాయ విచారణకు కేంద్రం ఆదేశించినా, కమిటీ ఏర్పాటు చేసినా, న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సల్మాన్‌ ఖుర్షీద్‌ ద్వారానే జరగాల్సి ఉంటుంది కాబట్టి, మంత్రిగా ఉంటూ పారదర్శక విచారణ ఎలా జరిపిస్తారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత న్యాయ విచారణకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే, న్యాయ విచారణను ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. తమ వద్ద ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా అన్ని ఆధాలున్నాయని, వాటిని న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. ఖుర్షీద్‌పై న్యాయ విచారణ జరిపిస్తే తాము స్వాగతిస్తామని, కానీ, అంతకు ముందు మంత్రి రాజీనామా చేయాల్సిందేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.