పనిచేయని రోజు పదవినుంచి తప్పుకుంటా

చిత్తూరు ,నవంబర్‌21:రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం అదృష్ఠంగా భావిస్తున్నానని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటీవలే ఆయన డిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరి ఆశీర్వాదం పొందిన తాను వివిధ వర్గాలన్నింటినీ కలుపుకుని ముందుకెళతానని స్పష్టం చేశారు.ఆ విషయంలో విఫలమైన రోజు స్వచ్ఛందంగా డీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటానని చెప్పారు. తనను వెన్నుతట్టి నడిపిస్తే కార్యకర్తల మధ్యలో కార్యకర్తగా పనిచేస్తానని  ప్రకటించారు. .కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, ప్రజాసంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వందలాది పథకాల గురించి ప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తానన్నారు.  డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎస్‌.సుధాకర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు.  వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పార్లమెంటు-, అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునే విధంగా చూడ్డమే తన లక్ష్యంగా ముందుకు కదులుతానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల తొలి సమావేశాన్ని శ్రీకాళహస్తిలో త్వరలోనే నిర్వహిస్తానని అమాస రాజశేఖరరెడ్డి ప్రకటించారు. చిత్తూరులో రంగనాథ్‌ భవన్‌, తిరుపతిలో నగర పార్టీ భవన నిర్మాణం త్వరలో చేపడ్తానని ప్రకటించారు.