పర్యాటక ప్రదేశంగా దుర్గం చెరువు అభివృద్ధి

ktrహైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పర్యాటక, టీఎస్ఐఐసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి ఆయన దుర్గంచెరువుని పరిశీలించారు. రూ. 184 కోట్లతో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుండి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు రోడ్డు కం బ్రిడ్జిని నిర్మిస్తామని ప్రకటించారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. మరో 20 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిత్యం వేల సంఖ్యలో వచ్చే ఐటీ ఉద్యోగులతో మాదాపూర్, సైబర్ టవర్స్ మెయిర్ రోడ్డులో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. దుర్గం చెరువు మీదుగా నిర్మించే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది.

ఈ సందర్భంగా దుర్గం చెరువు సుందరీకరణపై మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు కంపెనీలు ఇచ్చే నిధులతోపాటు జిహెచ్ఎంసీ నిధులతో దుర్గం చెరువు చుట్టు సైకిల్ ట్రాక్ తో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గం చెరువు సమీపంలో నివాసం ఉండేవాళ్లు, పర్యాటకులు ఇక్కడ గడిపేందుకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.