పల్లెల వికాసానికి గ్రామజ్యోతి

C

– రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల ఖర్చు

– గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి):

గ్రావిూణ ప్రాంతాల సమగ్ర సవిూకృత అభివృద్ధి కోసం గ్రామజ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఐదేళ్లలో 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా గ్రామాలను అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే గ్రామాల అభివృద్ధి కోసం నూతన కార్యక్రమం గ్రామజ్యోతి ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. గ్రావిూణాభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి 2 నుంచి 6 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం, గ్రావిూణ స్థాయిలో ఎవరికి వారే తమ ప్రణాళికలు తయారు చేసుకుని అభివృద్ధి చేసుకోవడం గ్రామ జ్యోతి లక్ష్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం విధివిధానాలు రూపొందించడానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీని సీఎం కేసీఆర్‌ నియమించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉంటారు.