పాక్‌జైళ్లో మగ్గుతున్న సుర్జిత్‌సింగ్‌ విడుదల

స్వదేశానికి చేరుకున్న సుర్జిత్‌..
లాహోర్‌, జూన్‌ 28 (జనంసాక్షి): ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భారతీయ ఖైదీ సుర్జీత్‌సింగ్‌ ఈ రోజు విడుదల అయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా పాకిస్థాన్‌లోని లాహోర్‌ జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న సుర్జీత్‌సింగ్‌ను జైలు నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న దృశ్యాలు పాకిస్తాన్‌ టీవి ఛానళ్లు విసృత్తంగా ప్రచారం చేశాయి. మొదట ఈ ప్రచారాన్ని చూసి సరబ్‌జిత్‌ విడుదల అయ్యాడని పుకార్లు బయలు దేరాయి. కాని తర్వాత సుర్జీత్‌సింగ్‌ తెలిసింది. 1980లో గూఢాచర్య నేరానికి పాల్పడ్డాడని సుర్జీత్‌సింగ్‌ను అప్పటి పాకిస్థాన్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి సుర్జీత్‌సింగ్‌ లాహోర్‌లోని కోట్‌లక్ఫాట్‌ జైల్‌లో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. కాగా ఈ రోజు సుర్జీత్‌సింగ్‌ను జైల్‌ నుంచి వ్యాన్‌లో వాఘేకు తరలించారు. ఈమేరకు సుర్జీత్‌సింగ్‌ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఇదిలా ఉండగా బుధవారం కరాచీలోని స్థానిక న్యాయస్థానం 300 మందికిపైగా భారతీయ మత్స్యకారులను నిర్ధోషులుగా విడుదల చేసింది. వీరు కూడా స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
స్వగ్రామంలో సంబరాలు
పంజాబ్‌లోని ఫిద్దే గ్రామంలో సుర్జీత్‌ విడుదలయ్యాడని తెలిసి సంబరాలు మొదలయ్యాయి. 30 ఏళ్లుగా పాక్‌ జైల్‌లో మగ్గుతున్న మా ఊరి బిడ్డ ఇన్నాళ్లుకు మా కళ్ల ముందుకు వస్తున్నాడని ఆ ఊరి ప్రజలు ఒకరికొకరు ఆనందం వ్యక్తం చేసుకుంటూ సంబరాలు చేసుతకుంటున్నారు.