పాక్‌ వన్డే జట్టులోకి తిరిగి రానున్న షోయబ్‌ మాలిక్‌

అక్మల్‌, సమీలకు కాంట్రాక్ట్‌ ఇచ్చే యోచనలో పిసిబీ
లాహోర్‌, జూలై 24 (జనంసాక్షి): ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పాకిస్థాన్‌ క్రికెట్‌ వన్డే జట్టులోకి మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం పాకిస్థాన్‌ జట్టును ఇంకా ఎంపిక చేయలేదు. అయితే బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మాలిక్‌తో పాటు చాలా కాలంగా జట్టుకు దూరమైన యాసిర్‌ హమీద్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఫావద్‌ అలమ్‌లకు చోటు కల్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం షోయబ్‌ మాలిక్‌ ఆసీస్‌తో జరిగే టీ ట్వంటీ జట్టుతో పాటు వరల్డ్‌కప్‌ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అటు యాసిర్‌ హమీద్‌ పాక్‌ తరపున చివరిసారిగా 2010లో ఆడాడు. యువ క్రికెటర్లు అజార్‌ అలీ, అసద్‌ షఫీక్‌ నిలకడలేని ఆట తీరుతో ఆందోళనలో ఉన్న సెలక్టర్లు వారికి ప్రత్యామ్నాయంగా హమీద్‌. ఫావద్‌లను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. హమీద్‌ ఇప్పటి వరకూ 25టెస్టులు, 56 వన్డేల ఆడాడు. 2010లో న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కి ఇంటర్వ్యూ పలు ఆరోపణలు చేయడంతో హమీద్‌పై బోర్డు నిషేధం విదించింది. ఇటీవలే అతను జరిమానాగా అర మిలియన్‌ కట్టడంతో నిషేధాన్ని ఎత్తివేసింది. ఇదిలా ఉంటే వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌, మహ్మద్‌ సమీలకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇవ్వాలని భావిస్తోంది.ప్రపంచ కప్‌ తర్వాత పామ్‌ కోల్పోయిన అక్మల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో ఇరుక్కున్నాడు. అప్పటి నుండి జాతీయ జట్టుకు దూరమైన అక్మల్‌ కాంట్రాక్ట్‌ కూడా కోల్పోయాడు. ఫాస్ట్‌ బౌలర్‌గా మంచి రికార్డు కలిగిన సమీ చాలా కాలం తర్వాత జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో నిలకడగా రాణించాడు. ప్రస్తుతం పిసీబీ కొత్త కాంట్రాక్టుల ప్రకారం కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు 3,13,000రూపాయలు, కేటగిరి బిలో ఉన్న ఆటగాళ్లకు 2,18,000 సి కేటగిరి ఆటగాళ్లకు 1,25,000చొప్పున నెలకు చెల్లిస్తోంది.